Earth: చందమామ రెండు మొహాలలో తేడాకు ఇదే కారణం.. తేల్చిన నాసా సైంటిస్టులు

NASA and Other Scientists Decoded Why There Is Difference Between Two Faces Of Moon

  • మరికొన్ని యూనివర్సిటీలతో కలిసి పరిశోధనలు
  • 4.3 బిలియన్ ఏళ్ల క్రితం జాబిలిని ఢీకొట్టిన గ్రహ శకలం
  • దక్షిణ ధృవం వద్ద బలమైన తాకిడి.. చంద్రగర్భంలోకి వేడి
  • మనకు కనిపించే వైపు పారిన లావా
  • వేడి మూలకాలతో నిండి ఆకర్షణీయంగా మారిన చందమామ

చంద్రుడి రెండు వైపులా (భూమి నుంచి మనకు కనపడే వైపు.. కనపడని వైపు) ఒకేలా ఉండకుండా.. వేర్వేరుగా ఎందుకున్నాయన్నది మన శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయంగా ఉండిపోయింది. ఎప్పటి నుంచో ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నాల్లో ఉన్నారు. రెండు వైపులా ఎందుకు వేర్వేరుగా ఉంటోందన్న దానిపై పరిశోధనలు చేస్తున్నారు. 

దానికి తాజాగా సమాధానం గుర్తించినట్టు చెబుతున్నారు. 430 కోట్ల ఏళ్ల క్రితం చందమామను ఓ గ్రహశకలం ఢీకొట్టడంలోనే దాని రహస్యమంతా దాగుందని అంటున్నారు. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడి మొహాన్ని ఆ ప్రభావమే తీవ్రంగా మార్చిందంటున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటికీ చెందిన శాస్త్రవేత్తలు కలిసి పరిశోధన చేసి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

గ్రహశకలం ఢీకొట్టడం వల్లే చందమామపై అతి కష్టమైన, కఠినమైన దక్షిణ ధృవ బేసిన్ ఏర్పడిందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్ డీ స్కాలర్, పరిశోధనకు నేతృత్వం వహించిన మ్యాట్ జోన్స్ చెప్పారు. ఆ భారీ తాకిడి వల్ల సౌర వ్యవస్థలోనే రెండో అతిపెద్ద బిలం చందమామపై ఏర్పడిందన్నారు. గ్రహశకలం ఢీకొట్టడం వల్ల భారీ స్థాయిలో వేడి చందమామ లోపలికి వెళ్లిందన్నారు. 

అయితే, ఆ ప్రభావం చంద్రుడి ఒకవైపు (మనకు కనిపించేది) ఎక్కువగా పడిందని, కొన్ని అరుదైన మూలకాలు, వేడి మూలకాలు పేరుకున్నాయన్నారు. వాటి వల్ల ఏర్పడిన అగ్నిపర్వత పేలుళ్లతో మనకు కనిపించే వైపు భారీ బిలాలు ఏర్పడి ఉంటాయన్నారు. గ్రహ శకలం ఢీకొట్టినప్పుడు భారీగా ప్రవహించిన లావా.. దగ్గరివైపు అప్పటికే ఏర్పడిన గోతుల్లోకి చేరిందని చెప్పారు. అందుకే మనకు కనిపించే వైపు చందమామ ఆకర్షణీయంగా.. కనిపించని వైపు చీకటిగా ఉంటుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News