Andhra Pradesh: ఆడుతూ ఆడుతూ.. అలా అలా.. అడవిలోకి వెళ్లిపోయిన నాలుగేళ్ల చిన్నారి!
- 36 గంటల తర్వాత ఆచూకీ లభ్యం
- కుప్పం మండలంలోని నక్కలగుంటలో ఘటన
- ఆచూకీని పట్టించిన పోలీస్ జాగిలం
ఓ నాలుగేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. అలా అలా.. దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయింది. 36 గంటల పాటు ఒక్కతే ఆ అడవిలో ఎటెటో వెళ్లింది. పోలీస్ జాగిలాల సాయంతో తిరిగి ఇల్లు చేరింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని నక్కలగుంటలో మూడు రోజుల క్రితం జరిగింది. మణి, కవిత దంపతుల కుమార్తె జోషిక (4) ఇంటి బయట ఆడుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది.
తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా చిన్నారి దొరకలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి.. గాలింపునకు ఆదేశించారు. దీంతో డీఎస్పీ గంగయ్య నేతృత్వంలోని పోలీసు సిబ్బంది తప్పిపోయిన రోజున రాత్రంతా గాలించారు. ఇంటికి దగ్గర్లోని నీటి కుంటల్లో వెతికినా దొరకలేదు.
చివరి ప్రయత్నంగా చిన్నారి వస్త్రాలను పోలీస్ జాగిలాలకు చూపగా.. అటవీ ప్రాంతం వరకు వెళ్లి ఆగింది. దీంతో పోలీసులు అడవిని జల్లెడ పట్టగా అంబాపురం అటవీ ప్రాంతంలో చిన్నారి జాడను గుర్తించారు. చిన్నారిని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆ పాప ఒంటరిగా ఉన్నా ధైర్యంగా గడిపిందని, ఎండ ఎక్కువగా ఉండడంతో కొంచెం వడదెబ్బ కొట్టి అస్వస్థతకు గురైందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. ముళ్లు గీరుకుని చేతులు, కాళ్లకు చిన్నపాటి గాయాలయ్యాయి.