Asaduddin Owaisi: అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు సాధారణమైపోయాయి: అసదుద్దీన్ ఒవైసీ

Owaisi reacts on Delhi clashes

  • నిన్న హనుమాన్ శోభాయాత్ర
  • దేశంలో పలుచోట్ల హింస
  • ఢిల్లీలోనూ ఉద్రిక్తతలు
  • 14 మందిపై ఎఫ్ఐఆర్
  • వారందరూ ముస్లింలేనన్న ఒవైసీ

ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా, 14 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై ఒవైసీ ట్వీట్ చేశారు. అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు సాధారణమైపోయాయని విమర్శించారు. పిస్టళ్లు పట్టుకుని అల్లర్లలో దర్శనమిచ్చేవారి సంఖ్య ఎక్కువవుతోందని, వీరిపై ఆయుధాల చట్టం వర్తింపజేయరా? అని ఒవైసీ ప్రశ్నించారు. 

"మీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. వారందరూ ముస్లింలే" అని ఆరోపించారు. ఆయుధాలు ధరించి విచ్చలవిడిగా సంచరిస్తూ మసీదులను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడం నేరం కాదా? అని మండిపడ్డారు. దేశ రాజధానిలో ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఒవైసీ నిలదీశారు. 

ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైనా ఒవైసీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఊరేగింపులో తుపాకులు ధరించి నడిచినవారి పేర్లను ఢిల్లీ సీఎం ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ప్రశ్నించారు. మసీదులపై దాడులకు పాల్పడిన ఘటనలను ఇంతవరకు ఆయన ఖండించలేదని అసదుద్దీన్ విమర్శించారు. 

Asaduddin Owaisi
Clashes
New Delhi
Hanuman Shobha Yatra
Amit Shah
Arvind Kejriwal
MIM
India
  • Loading...

More Telugu News