UK: కీలక సమయంలో భారత్ కు వస్తున్న బ్రిటన్ ప్రధాని

UK Prime Minister Boris Johnson to visit India on April 21

  • 21, 22వ తేదీల్లో భారత్ లో పర్యటన
  • ఆర్థిక, రక్షణ భాగస్వామ్యంపై చర్చలు
  • ఇరుదేశాల ప్రధానుల భేటీ

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ కు రానున్నారు. ఈ నెల 21న ఆయన భారత పర్యటన ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా తన దాడులను తీవ్రతరం చేయడం, ఆ దేశంపై పెద్ద ఎత్తున ఆంక్షలకు మద్దతునిస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈ కీలక సమయంలో భారత పర్యటనను ఎంపిక చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

‘ఇండియా-యూకే  రోడ్ మ్యాప్ 2030’ అమలును ఇరుదేశాల ప్రధానులు ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెద్ద ఎత్తున బలోపేతం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యాలుగా ఇరుదేశాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2035 నాటికి 34 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఉన్నాయి. బ్రెగ్జిట్ (ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్) తర్వాత బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఇదే మొదటిసారి.

గుజరాత్ పర్యటన సమయంలో భారత్ లో పెట్టుబడులపై జాన్సన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 21న అహ్మదాబాద్ లో జాన్సస్ పర్యటించనున్నారు. ‘‘వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యంపై ఏప్రిల్ 22న భారత ప్రధాని మోదీతో జాన్సన్ చర్చించనున్నారు’’అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ విషయంలో భారత్ తటస్థ వైఖరిని అమెరికా తప్పు పడుతుండడం తెలిసిందే. కానీ, అదే సమయంలో ముఖ్య దేశాల నాయకులు భారత్ కు వస్తూ కీలక చర్చలు నిర్వహిస్తుండడం.. భారత్ కు పెరిగిన ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. 

  • Loading...

More Telugu News