Telangana: ఏపీ సీఎంతో కేసీఆర్ కుమ్మక్కై.. దోచిపెడుతున్నారు: సంజయ్ తీవ్ర ఆరోపణలు

Sanjay Fires On CM KCR In An Open Letter

  • సాగునీటి ప్రాజెక్టులు, వలసలపై బహిరంగ లేఖ
  • హెల్సింకీ సదస్సు ప్రకారం నీటి కేటాయింపులు జరగట్లేదని ఆరోపణ
  • సంగమేశ్వరం ప్రాజెక్టును కడుతున్నా కేసీఆర్ ఆపలేదని మండిపాటు
  • రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమయ్యారని ఆగ్రహం

పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, వలసల నివారణపై సీఎం కేసీఆర్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న తనకు ఎక్కడకెళ్లినా ప్రజలు సమస్యలు చెప్పుకొంటున్నారని, సాగునీటి సమస్యలున్నాయని ఆయన అన్నారు. 

వెనుకబడిన జిల్లాలోని పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రజాసంగ్రామయాత్ర చేస్తున్నానని చెప్పారు. ‘‘మీ సుపుత్రుడు కేటీఆర్, మీ పార్టీ వాళ్లు మాత్రం పాదయాత్రపై విషం కక్కుతున్నారు’’ అని విమర్శించారు. 

2009లో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్.. జిల్లాను దత్తత తీసుకుని సాగునీటి సమస్య లేకుండా సస్యశ్యామలం చేస్తానంటూ హామీ ఇచ్చారని, ఆ హామీ ఇన్నేళ్లవుతున్నా నెరవేరలేదని విమర్శించారు. టీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల 8 ఏళ్లలో ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన ప్రాజెక్టులను కేసీఆర్ తన ఖాతాలో వేసుకుని పాలమూరంతా సస్యశ్యామలం అయిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. 

పాలమూరు నుంచి ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బొంబాయికి వెళ్లే బస్సును రద్దు చేసి పాలమూరులో వలసలు ఆగిపోయాయని నమ్మబలుకుతున్నారని సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సాగుకు అనుకూలమైన వేలాది ఎకరాలున్నాయని, కానీ, సాగు నీరందక పాలమూరు ప్రజలు పొట్టచేతబట్టుకుని వలసెళ్లిపోతున్నారని చెప్పారు. 

హెల్సింకీలో నిర్వహించిన అంతర్జాతీయ జలసదస్సు నియమాలు, బచావత్ అవార్డ్ ఆదేశాల మేరకు పరీవాహక ప్రాంత ప్రజల అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు నీటిని కేటాయించాలన్నారు. అయితే, 15 ఏళ్లుగా కృష్ణా జలాలు బేసిన్ దాటి బయటకు పోతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తనట్టే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాలను తీర్చాలన్న శ్రద్ధ ప్రభుత్వంలో కనిపించడం లేదని మండిపడ్డారు. నారాయణపేట–కొడంగల్ పథకాన్ని ఇప్పటికే అటకెక్కించారని, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా పాలమూరుకు చుక్క నీరు అందడం లేదని, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలే జరగడం లేదని సంజయ్ విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో నీళ్ల సమస్య ప్రధానమైనదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా దక్కడం లేదని, ఆ విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఆర్డీఎస్ ద్వారా పాలమూరు ప్రాంతంలో 15.9 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉన్నా.. కనీసం 5 టీఎంసీలు కూడా వాడడం లేదన్న విషయాన్ని పాలమూరులో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. 

ఎన్నికలప్పుడే ఆర్డీఎస్ గురించి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రాజెక్టుల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని, నీళ్లివ్వనప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ఆ సొమ్మంతా కాంట్రాక్టర్లు, మీ కుటుంబం, బంధువులు, పార్టీకే చెందిందంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. 

ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (సంగమేశ్వరం)ను ఆపడంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయిందని సంజయ్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ ఈ విషయంపై స్పందించకపోయినా.. బీజేపీనే స్పందించిందని గుర్తు చేశారు. సంగమేశ్వరంపై 2020 మే 5న ఏపీ సర్కార్ జీవో ఇస్తే.. అదే ఏడాది అదే నెల 12న కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి తానే లేఖ రాశానని చెప్పారు. దీంతో ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా బోర్డు ద్వారా కేంద్రం.. ఏపీని ఆదేశించిందన్నారు. 

ప్రాజెక్టును ప్రకటించినా, టెండర్లు పిలిచినా.. పనులు జరిగినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించలేదని ఆరోపించారు. ఏపీకి నీటి వాటాను దోచిపెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్రం 2020 ఆగస్టులో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తేదీ నిర్ణయించినా బిజీగా ఉన్నానంటూ సమావేశాన్ని కేసీఆర్ వాయిదా వేయించారని, తెలంగాణ ప్రజల సమస్య కన్నా ముఖ్యమైన పని ఏముంటుందని సంజయ్ ప్రశ్నించారు. ఏపీ సీఎంతో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని మండిపడ్డారు. 

ఇప్పటికే సంగమేశ్వరం ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ దేనని అన్నారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 555 టీఎంసీలు రావాల్సి ఉన్నా కేవలం 299 టీఎంసీలకు అంగీకరించిన కేసీఆర్.. తెలంగాణ హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే 68.5 శాతం ఉందని, అలాంటప్పుడు అంత తక్కువ నీళ్లకు ఎలా ఒప్పుకొన్నారని నిలదీశారు. అయితే, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రంపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. 

పాలమూరు పెండింగ్ సాగు ప్రాజెక్టులపై చర్చించేందుకు తాము సిద్ధమని, మీరు సిద్ధమా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. పాలమూరు ప్రజల పట్ల టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం, వివక్షపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News