CJI: కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోలేదు.. సీజేఐ రమణ గారి వల్లే ఆ సమస్య పరిష్కారమైంది: సీఎం కేసీఆర్

CM KCR Says CJI Solved The Judges Recruitment Problem

  • బెంచీలు పెంచాలని ప్రధానికి విన్నవించినా పెండింగ్ లోనే పెట్టారన్న సీఎం  
  • జస్టిస్ రమణ సీజేఐ అయ్యాకే సమస్య పరిష్కారమైందని వెల్లడి 
  • 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్ కట్టిస్తామన్న కేసీఆర్   

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టు విడిపోయాక బెంచీలు, జడ్జిల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖలు రాశానని, కానీ, అవెప్పుడూ పెండింగ్ లోనే ఉండేవని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే, జస్టిస్ రమణ సీజేఐ అయ్యాకే ఆ సమస్యకు పరిష్కారం దొరికిందని పేర్కొన్నారు. హైదరాబాద్ పై ఆయనకున్న అమితమైన ప్రేమతో ప్రధాని, కేంద్రంతో మాట్లాడి హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఉండడం గర్వకారణమన్నారు. జడ్జిల సంఖ్య పెరగడంతో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా, సివిల్ కోర్టుల్లో పనిభారం ఎక్కువగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, న్యాయమూర్తుల హోదాకు తగినట్టు 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్ నిర్మించి ఇస్తామని, సీజేఐ రమణతోనే శంకుస్థాపన చేయిస్తామని కేసీఆర్ చెప్పారు. 

మరోవైపు తెలంగాణ ఏర్పడ్డాక అందరి సహాయ సహకారాలతో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని కేసీఆర్ అన్నారు. ఆర్థిక పురోగతి బాగుందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ముందుకెళ్తున్నామని చెప్పారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, అన్ని జిల్లాల్లోనూ సమీకృత కలెక్టరేట్లను నిర్మించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

CJI
Justice N.V. Ramana
Telangana
High Court
TS High Court
KCR
  • Loading...

More Telugu News