Twitter CEO: మస్క్ చేతికి వెళితే ట్విట్టర్ భవిష్యత్తు ఏంటి?.. ప్రశ్నించిన ఉద్యోగులు
- మస్క్ ఆఫర్ పై నిర్ణయం తీసుకోలేదన్న ట్విట్టర్ సీఈవో
- వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీ
- ఇందుకోసం క్లిష్టమైన ప్రక్రియను అనుసరిస్తామని వెల్లడి
ఒక్క రోజు ముందు వరకు ప్రశాంతంగా పని చేసుకుపోయిన ట్విట్టర్ ఉద్యోగుల్లో గురువారం నుంచి ఆందోళన పెరిగిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు భారీ ఆఫర్ ఇవ్వడం తెలిసిందే. మస్క్ చేతికి వెళితే తమ ఉద్యోగాల భవిష్యత్తు ఏమవుతుందోనన్న అనిశ్చితి ఏర్పడింది. దీంతో దీనిపై నేరుగా ట్విట్టర్ సీఈవో, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ను ఉద్యోగులు అడిగేశారు.
గురువారం ఉద్యోగులతో 25 నిమిషాల పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని (ప్రశ్నోత్తరాలు) పరాగ్ అగర్వాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పలు ప్రశ్నలు సంధించారు. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తే తమ భవిష్యత్తు ఏంటన్నది అందులో ఒక ప్రశ్న. దీనికి పరాగ్ అగర్వాల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
మస్క్ ఆఫర్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, విషయం పరిశీలనలోనే ఉందని స్పష్టం చేశారు. వాటాదారుల ప్రయోజనాలకు ఏది అత్యుత్తమమో అదే చేస్తామంటూ, ఇందుకోసం క్లిష్టమైన ప్రక్రియను అనుసరిస్తామని చెప్పారు. ఒకవేళ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తే, ఉద్యోగుల తొలగింపుల గురించి ఓ ఉద్యోగి ప్రశ్నించాడు. వ్యక్తిగత పనితీరు రేటింగ్ ల ద్వారా అది నిర్దేశించబడదని అగర్వాల్ బదులిచ్చారు.