Mekathoti Sucharitha: అలక వీడని సుచరిత.. అనారోగ్య కారణంతో సజ్జలను కలిసేందుకు నిరాకరణ!

Sucharita Refusal to meet Sajjala due to illness
  • మంత్రి పదవి దక్కనందుకు అలక
  • న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎంపీ మోపిదేవి
  • రెండు రోజులుగా గుంటూరులో కార్యకర్తల ఆందోళన
మంత్రి పదవి దక్కనందుకు అలకబూనిన సీనియర్ ఎమ్మెల్యే, ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పట్టువీడడం లేదు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా అలకవీడడం లేదు. ఆదివారం రాత్రి సుచరిత ఇంటికి వెళ్లిన మోపిదేవి.. సామాజిక సమీకరణాల వల్లే కేబినెట్‌లో చోటు కల్పించలేకపోయామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

అలాగే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెకు ఫోన్ చేసి, రమ్మని చెప్పారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆమె వెళ్లలేదని ఆమె సన్నిహితులు చెప్పారు. వీరిద్దరు మినహా అధిష్ఠానం నుంచి సుచరితతో ఎవరూ మాట్లాడలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు.

మరోవైపు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు  సుచరిత ఆదివారం ప్రకటించారు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సుచరితకు మంత్రి పదవి దక్కకపోవడంతో కార్యకర్తలు రెండు రోజులుగా గుంటూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
Mekathoti Sucharitha
Andhra Pradesh
YSRCP
Mopidevi Venkataramana
Sajjala Ramakrishna Reddy

More Telugu News