Vijayashanti: కేసీఆర్ తన రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారు: విజయశాంతి

Vijayasanthi slams CM KCR over paddy and farmers issue

  • కేసీఆర్ పై ధ్వజమెత్తిన విజయశాంతి
  • ప్రజల దృష్టి మరల్చేందుకే ధర్నాలు చేస్తున్నారని విమర్శలు
  • కమీషన్లపైనే ధ్యాస అని వెల్లడి
  • రాష్ట్రం అప్పులపాలైందని వ్యాఖ్యలు

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ మహిళా నేత విజయశాంతి ధ్వజమెత్తారు. తెలంగాణలోని సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు దిగారని ఆరోపించారు. 

దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, మొన్నటి ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో కేసీఆర్ లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు బీజేపీ వైపు వెళ్లకుండా, సమస్యలపై తనను నిలదీయకుండా దొంగ ధర్నాలు షురూ చేశారని విమర్శించారు. 

కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని, తన రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని విమర్శించారు. కమీషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఆయన వద్ద రాష్ట్రాలు తిరగడానికి, ఎన్నికల కోసం పార్టీకి వ్యూహకర్తలను నియమించుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ, వడ్లు కొనేందుకు, రైతులకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఉండవని మండిపడ్డారు.

మిల్లర్లతో కుమ్మక్కయిన కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని... పాకిస్థాన్, శ్రీలంక దేశాల కంటే తెలంగాణ అప్పులే ఎక్కువని విజయశాంతి పేర్కొన్నారు.

Vijayashanti
KCR
Paddy
Farmers
BJP
TRS
Telangana
  • Loading...

More Telugu News