West Bengal: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రేప్ బాధితురాలి తండ్రి, నిర్భయ తల్లి మండిపాటు
- నా బిడ్డ గర్భవతి అని అంటారా? అంటూ బాధితురాలి తండ్రి మండిపాటు
- సీఎం అయి ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్న
- సీఎం పదవిలో ఉండే అర్హత మమతకు లేదన్న నిర్భయ తల్లి
14 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. తాజాగా రేప్ బాధితురాలి తండ్రి మమత వ్యాఖ్యలపై మండిపడ్డారు. నదియాలోని హన్స్ ఖాలీలో 14 ఏళ్ల బాలికపై తృణమూల్ పార్టీకి చెందిన నేత సమర్ గోవాలా కొడుకు బ్రజ గోపాల్ గోవాలా అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. తీవ్రగాయాలైన ఆ బాలిక ఆదివారం చనిపోయింది.
ఘటనపై స్పందించిన మమత.. అమ్మాయి, అబ్బాయి మధ్య అఫైర్ ఉందని, అమ్మాయికి గర్భం కూడా వచ్చిందని, ఆ విషయం తల్లిదండ్రులకూ తెలుసని వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై మండిపడిన బాధితురాలి తండ్రి.. ఓ ముఖ్యమంత్రి అయి ఉండి ఆమె అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.
తన కూతురు గర్భవతని ఎలా అంటారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. సమర్ గోవాలా ఒత్తిడి చేయడంతో తమ కూతురు మృతదేహానికి పోస్ట్ మార్టం చేయలేదని, అలాగే బలవంతంగా అంత్యక్రియలు చేయించారని ఆరోపించారు.
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై నిర్భయ తల్లి కూడా మండిపడ్డారు. ఓ బాధితురాలిపై అంత నీచంగా మాట్లాడిన ఆమెకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. ఒక మహిళగానైనా ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిందికాదని, ఆమె తన పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడారని అన్నారు. అత్యాచారానికి పాల్పడి, ఓ బాలిక మృతికి కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నేరాలను మరింత ప్రోత్సహిస్తాయన్నారు. ఇలాంటి నేతలకు ఓట్లే ముఖ్యమన్నారు.