Chahal: మరో దిగ్భ్రాంతికర సంఘటన వెల్లడించిన టీమిండియా బౌలర్ చహల్
- ఇటీవల చహల్ సంచలనం
- ఓ ఆటగాడు తనను 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడని వెల్లడి
- మరో ఘటనలో సైమండ్స్, ఫ్రాంక్లిన్ లపై ఆరోపణలు
- తనను కట్టేసి గదిలో పడేశారని వెల్లడి
ఇటీవల టీమిండియా బౌలర్ యజువేంద్ర చహల్ వెల్లడించిన ఓ పాత సంఘటన క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఐపీఎల్ 2015 సీజన్ లో ఓ తాగుబోతు ఆటగాడు హోటల్ లోని 15వ అంతస్తు నుంచి తనను కిందికి వేలాడదీసిన ఘటనను చహల్ బహిర్గతం చేశాడు. అయితే ఆ ఆటగాడు ఎవరన్నది చహల్ చెప్పలేదు. కాగా, ఇలాంటిదే మరో దిగ్భ్రాంతికర సంఘటనను చహల్ వెల్లడించాడు.
ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్సిన్ లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరూ తనను కట్టేసి ఓ గదిలో పడేశారని వివరించాడు. "2011లో ముంబయి ఇండియన్స్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పుడే మేం చెన్నైలో ఉన్నాం. సైమండ్స్ బాగా మద్యం తాగాడు. అతడి మనసులో ఏముందో అప్పటికి నాకు అర్థం కాలేదు. కానీ సైమండ్స్, జేమ్స్ ఫ్రాంక్లిన్ నా చేతులు, కాళ్లు కట్టేశారు. విడిపించుకో చూద్దాం అన్నారు. ఆ తర్వాత నా నోటికి టేప్ అంటించేశారు.
ఆ రాత్రంతా నన్ను గదిలో అలాగే వదిలేసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఉదయం రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన హోటల్ సిబ్బంది నన్ను చూసి, ఇతరులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి నా కట్లు విప్పారు" అని వివరించాడు. అయితే, ఆ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరూ తనకు క్షమాపణలు చెప్పలేదని చహల్ స్పష్టం చేశాడు.
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే... నాడు చహల్ ను ఏడిపించిన వారిలో ఒకరైన జేమ్స్ ఫ్రాంక్లిన్ ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో డుర్హామ్ జట్టుకు కోచ్ గా ఉన్నాడు. చహల్ ఉదంతాన్ని డుర్హామ్ జట్టు మేనేజ్ మెంట్ తీవ్రంగా పరిగణిస్తోంది. 2011 నాటి సంఘటనలు తమకు తెలిశాయని, తమ సిబ్బందిలో ఒకరిపై ఆరోపణలు వచ్చాయని డుర్హామ్ జట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై తమ క్లబ్ విచారణ జరుపుతుందని, ఇందులో ప్రమేయం ఉన్న అందరితో మాట్లాడతామని, నిజానిజాలు నిర్ధారించుకుంటామని పేర్కొంది.