Nadendla Manohar: ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలురైతుల కుటుంబాలకు జీవో ప్రకారం రూ.7 లక్షలు ఇవ్వాలి: నాదెండ్ల
- అనంతపురం జిల్లాలో రేపు పవన్ పర్యటన
- ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు సాయం
- ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న నాదెండ్ల
- రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటోందని ఆరోపణ
అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కల్యాణ్ రేపు పరామర్శించి, ఆర్థికసాయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. కౌలురైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
కౌలురైతుల ఆత్మహత్యలపై మూడేళ్ల కిందటే చట్టం చేశారని, జీవో ప్రకారం రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. కానీ, ప్రభుత్వం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు భరోసా అందడంలేదని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంలో పవన్ పర్యటనతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెయ్యి మంది కౌలురైతుల కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 28 మంది కౌలురైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్నామని తెలిపారు.