Accident: త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాదం.. 19 గంటలుగా ఆకాశంలోనే చిక్కుకుపోయిన 50 మంది
- నిన్న బైద్యనాథ్ ఆలయ పర్యటనకు వెళ్తుండగా ప్రమాదం
- ఇద్దరు మృతి చెందినట్టు అధికారుల ప్రకటన
- కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
ఝార్ఖండ్ లోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాదం జరిగింది. నిన్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సరదాగా గడుపుదామని వెళ్లిన యాత్రికులు.. ప్రమాదంతో 19 గంటలుగా ఆకాశంలోనే చిక్కుకుపోయారు. కేబుల్ కార్లు ప్రమాదానికి గురి కావడంతో ఇద్దరు చనిపోయారు. మొత్తంగా 50 మంది కేబుల్ కార్లలో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు.
బైద్యనాథ్ ఆలయ సందర్శన కోసం వివిధ ప్రాంతాల నుంచి నిన్న 50 మందికిపైగా యాత్రికులు రోప్ వే మార్గంలో బయల్దేరారు. అయితే, సాంకేతిక కారణాలతో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ఆకాశంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతోంది. వైమానిక దళం సాయం చేస్తోంది.
ఎం 17 హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. అందరినీ సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ త్రికూట్ రోప్ వే భారత్ లోనే ఎత్తైన రోప్ వే. 766 మీటర్ల పొడవుంటుంది. 25 క్యాబిన్లతో ప్రయాణాలు చేస్తుంటారు. ఒక్కో దాంట్లో నలుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది.