Mekapati Goutham Reddy: ఎన్నికల బరిలోకి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి
![mekapati vikram reddy will entry into politics](https://imgd.ap7am.com/thumbnail/cr-20220409tn6251b4bdabb59.jpg)
- గుండెపోటుతో మరణించిన గౌతమ్ రెడ్ది
- త్వరలోనే ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక
- గౌతమ్ రెడ్డి స్థానంలోకి ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి
దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి దిగనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితం గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేకపాటి ఫ్యామిలీ నేతృత్వంలోని కేఎంసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీగా విక్రమ్ రెడ్డి కొనసాగుతున్నారు.
గుండెపోటు కారణంగా మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడంతో ఆయన నేతృత్వం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య బరిలోకి దిగుతారని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. ఇదే విషయంపై తమ కుటుంబంలో సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పిన రాజమోహన్ రెడ్డి.. గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్యను కాకుండా ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయంపై తమ కుటుంబం మొత్తం ఏకగ్రీవంగానే నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.