COVID19: అసమానతల ప్రపంచం వల్లే కొత్త వేరియంట్లు: ఐక్యరాజ్యసమితి తీవ్ర వ్యాఖ్యలు

UN Expresses Anguish for not supplying to Poor Nations

  • కరోనా ఇంకా పోలేదని హెచ్చరిక
  • యూరప్ లో రోజూ 15 లక్షల కేసులు వస్తున్నాయని వెల్లడి
  • పేద దేశాలకు ఇంకా వ్యాక్సిన్ అందలేదని ఆవేదన

యూరప్ ను కరోనా చుట్టేస్తుండడంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. సగటున నాలుగు నెలలకోసారి కొత్త వేరియంట్లు పుట్టుకురావడం తీవ్రమైన విషయమని, మహమ్మారి ఇంకా పోలేదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. అన్నిచోట్లా ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు అందేలా ప్రభుత్వాలు, ఫార్మా సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరా బాధ్యతను చూస్తున్న ఐరాస ‘గావి కొవ్యాక్స్’ గ్రూప్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్ మెంట్ సదస్సులో ఆయన వీడియో సందేశమిచ్చారు. ప్రపంచాన్ని రక్షించాలంటే కరోనాను పారదోలాలని అన్నారు. 

ప్రస్తుతం యూరప్ లో రోజుకు 15 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం మరో వేవ్ యూరప్ ను కుదిపేస్తోందన్నారు. ఇప్పటికీ చాలా దేశాల్లో మరణాల రేటు భారీగా ఉందన్నారు. కరోనా ఎంత వేగంగా మార్పులు చేసుకుంటుందో అనే దానికి ఒమిక్రాన్ వేరియంటే నిదర్శనమన్నారు. 

చాలా పేద దేశాలకు ఇంకా వ్యాక్సిన్లు అందనేలేదని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతల ప్రపంచానికి ఇదే నిదర్శనమన్నారు. అదే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకురావడానికి కారణమవుతోందన్నారు. దాని వల్ల మరణాలు పెరిగి, మానవ, ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతున్నాయని చెప్పారు. 

ప్రతి దేశానికి 70 శాతం వ్యాక్సినేషన్ జరగాలన్న లక్ష్యానికి చాలా దూరంగా ఆగిపోయామని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచంలో బీఏ 1, బీఏ 2 కలిసి ‘ఎక్స్ఈ’ అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News