Shikhar Dhawan: శిఖర్ ధావన్ ఖాతాలో అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా చరిత్ర పుటల్లోకి!
- టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 బౌండరీలు బాదిన ధావన్
- టీ 20ల్లో వెయ్యి బౌండరీలు బాదిన తొలి ఇండియన్‌గా రికార్డు
- ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి
టీమిండియా ఓపెనర్, పంజాబ్ బ్యాటర్ శిఖర్ ధావన్ నిన్న అత్యంత అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 1000 బౌండరీలు సాధించిన తొలి ఇండియన్‌గా, ఓవరాల్‌గా ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గుజరాత్ టైటాన్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్ ధావన్‌కి 307వది. ఈ మ్యాచ్‌కు ముందు 997 బౌండరీలతో ఉన్న ధావన్.. నాలుగు ఫోర్లు కొట్టి రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. ధావన్ తర్వాతి స్థానాల్లో 917 బౌండరీలతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (875), సురేశ్ రైనా (779) ఉన్నారు.
36 ఏళ్ల ధావన్ తన 15 ఏళ్ల కెరియర్‌లో టీ20 క్రికెట్‌లో 8850కి పైగా పరుగులు చేశాడు. 2011లో భారత జట్టులో చోటు సంపాదించడానికి ముందు 2007లో పొట్టి ఫార్మాట్‌లో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 68 టీ20లు ఆడిన ధావన్ 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 5880కిపైగా పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 6,341 పరుగులతో కోహ్లీ కంటే ముందున్నాడు.
ఇక, టీ20ల్లో అత్యధిక బౌండరీలు సాధించిన వారిలో క్రిస్ గేల్ అందరికీ కంటే ముందున్నాడు. 463 మ్యాచుల్లో గేల్ 1,132 బౌండరీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో అలెక్స్ హేల్స్ (1,054), డేవిడ్ వార్నర్ (1,005), అరోన్ ఫించ్ (1004)లు ధావన్ కంటే ముందున్నారు.