Cricket: ఆ తాగుబోతు ఆటగాడు నన్ను 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడు: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు
- ముంబై ఇండియన్స్ కు ఆడినప్పటి ఘటనను వెల్లడించిన బౌలర్
- 2013లో బెంగళూరుతో మ్యాచ్ తర్వాత జరిగిందని వెల్లడి
- ఈ ఘటన గురించి ఎవరికీ తెలియదన్న చాహల్
- అందరికీ తెలియాలనే బయటపెడుతున్నానని వ్యాఖ్య
- ఘటనపై మండిపడుతున్న క్రికెట్ అభిమానులు
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నాన్ని, ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి వెల్లడించాడు. 2013లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు జరిగిన ఆ ఘటనను తాజాగా ఇన్నేళ్లకు క్రికెట్ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న అతడు.. అశ్విన్ తో నిర్వహించిన స్పెషల్ ప్రోగ్రామ్ లో ఆ వివరాలు చెప్పుకొచ్చాడు.
బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ‘ఆ తాగుబోతు ఆటగాడు’ తథేకంగా తనవైపే చూశాడని, తనను రమ్మని పిలిచి హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడేశాడని చెప్పాడు. చంపినంత పనిచేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘నేను ఇప్పటిదాకా ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నా స్టోరీ అందరికీ తెలియాలనుకుంటున్నాను. నేను 2013లో ముంబై తరఫున ఆడుతున్నాను. బెంగళూరులో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అయ్యాక గెట్ టు గెదర్ పార్టీ జరిగింది.
అక్కడ ఓ ఆటగాడు బాగా తాగి ఉన్నాడు. అతడి పేరు నేను చెప్పదలచుకోలేదు. ఆ తాగుబోతు ఆటగాడు నన్ను పిలిచి బయటకు తీసుకెళ్లాడు. నన్ను ఎత్తుకుని 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడు. నాకు ఒక్కసారిగా భయమేసింది. అతడి మెడ చుట్టూ నేను చేతులు బిగించి పట్టుకున్నాను. చేతులు జారాయా.. నేను చచ్చినట్టే. దీంతో అక్కడున్న ఇతర ఆటగాళ్లు వచ్చి నన్ను పైకి లాగారు. కళ్లు తిరిగి పడిపోయిన నాకు కొన్ని నీళ్లిచ్చారు. దీంతో కొద్దిలో చావును తప్పించుకున్నాను. ఆటగాళ్లు నన్ను రూమ్ కు తీసుకెళ్లారు’’ అని చాహల్ వివరించాడు.
అయితే, ఇన్నేళ్లు మనసులోనే దాచుకున్న విషయాన్ని చాహల్ ఇప్పుడు బయటకు చెప్పడంతో అభిమానులంతా కంగు తింటున్నారు. ఇంతటి అరాచకానికి పాల్పడిన ఆ ఆటగాడెవరో చెప్పాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు చెబితే అతడిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటు ఈ వ్యవహారాన్ని బీసీసీఐ దృష్టికి కూడా తీసుకెళుతున్నారు.
పిచ్చి కథనాలను సంచలనాత్మకం చేస్తారుగానీ.. ఇంతటి సీరియస్ విషయాన్ని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. బెదిరింపులు బాధితుడిని శక్తిహీనుడిని చేస్తాయని, కానీ, ఆ బెదిరింపుల గురించి బయటకు చెప్పనివ్వకుండా దాచేసేందుకు ప్రయత్నించడం మరింత దారుణమని అంటున్నారు. ఆట అంటే కించిత్ గౌరవమైనా ఉండి ఉంటే ముంబై ఇండియన్స్ జట్టు వెంటనే స్పందించాలని, వాళ్లు ఇంతటి తీవ్రమైన ఘటనను దాచేయడం షాక్ కు గురిచేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, 2013లో ముంబై జట్టులోకి రూ.10 లక్షల బేస్ ప్రైస్ తో చాహల్ అడుగుపెట్టాడు. ఘటన జరిగిన తర్వాత ఆ మరుసటి ఏడాదే అంటే 2014లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్లిపోయాడు. ఇన్నేళ్ల పాటు జట్టులోనే ఉన్న అతడిని.. తాజా వేలంలో బెంగళూరు రిలీజ్ చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.