Salary: ఈ ఏడాది ఉద్యోగుల జీతాల పెంపు భారీగానే.. శాలరీ రిపోర్ట్ లో వెల్లడి
- సగటున 9 శాతం చొప్పున హైక్ లు
- అత్యధికంగా యూనికార్న్ లలో 12 శాతం
- మంచి ప్రతిభ చూపించే ఉద్యోగులకు 25% పెంపు
- వారికి అదనంగా బోనస్ లు, ఇన్సెంటివ్ లు
ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలు, జీతాల పెరుగుదల భారీగానే ఉంటుందని తేలింది. జీతాల పెంపు సగటున 9 శాతం ఉండే అవకాశం ఉందని ‘మైఖేల్ పేజ్ శాలరీ రిపోర్ట్ 2022’లో వెల్లడైంది. మహమ్మారి రావడానికి ముందు కన్నా ఇప్పుడు జీతాల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని గుడ్ న్యూస్ చెప్పింది. మహమ్మారికన్నా ముందు జీతాల పెరుగుదల కేవలం 7 శాతమేనని గుర్తు చేసింది.
అయితే, యూనికార్న్ లు, స్టార్టప్ లు, కొత్త తరం కార్పొరేషన్లే అత్యధికంగా సగటున 12 శాతం చొప్పున జీతాలు పెంచే అవకాశమున్నట్టు సంస్థ నివేదికలో వెల్లడించింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం, స్థిరాస్తి, నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగాల్లోనూ చెప్పుకోదగిన వృద్ధి ఉంటుందని పేర్కొంది.
ఈ–కామర్స్ కు డిమాండ్ ఉండడం, చాలా రంగాలూ డిజిటల్ కు మారిపోతుండడంతో కంప్యూటర్ సైన్స్ చదివిన సీనియర్ ఉద్యోగులకు వేతనాల్లో పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పింది. పెద్ద విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో చదివిన మెషీన్ లెర్నింగ్ తెలిసిన డేటా సైంటిస్టులు, వెబ్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్ లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పింది.
ఉద్యోగంలో మంచి ప్రదర్శన చూపించిన వారిని మరిన్ని మంచి ఆఫర్లిచ్చి సంస్థలు రీటెయిన్ చేసుకుంటాయని తెలిపింది. క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ వారీగా జీతాలను పెంచే అవకాశముందని చెప్పింది. దాంతో పాటు ప్రమోషన్లు ఇవ్వడం, స్టాక్ లలో ఇన్సెంటివ్ లు ప్రకటించడం, రిటెన్షన్ బోనస్ లు ఇవ్వడం, మిడ్ టర్మ్ ఇంక్రిమెంట్లు వంటి ఆఫర్లను మంచి ఉద్యోగులకు ఇస్తాయని పేర్కొంది. అలాంటి ఉద్యోగులకు 20 నుంచి 25 శాతం వరకు జీతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.