Karnataka: నా మీద కేసులు పెట్టే అవకాశం ఉంది.. పోస్టింగుల కోసం కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది: బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్
- గత డిసెంబర్ లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న భాస్కర్ రావు
- ఇటీవలే కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరిన మాజీ ఐపీఎస్
- కర్ణాటక నుంచి అవినీతిని తరిమి కొట్టడమే తన లక్ష్యమని వ్యాఖ్య
ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసులు నమోదు చేయడం, రెయిడ్స్ నిర్వహించడం జరగొచ్చని అన్నారు. రేపే ఇవన్నీ జరగొచ్చని కూడా అన్నారు. దేన్నైనా సరే ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కూడా ఇలాంటి వాటిని ఎన్నింటినో ఎదుర్కొన్నారని అన్నారు.
కేజ్రీవాల్ ఎన్నో త్యాగాలు చేశారని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని భాస్కర్ రావు చెప్పారు. సమాజంలో సంస్కరణలను తీసుకురావాలని పని చేసే ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. కర్ణాటక నుంచి అవినీతిని తరిమికొట్టాలని తాను ప్రతిజ్ఞ చేశానని చెప్పారు.
పోస్టింగుల కోసం అధికారులు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన దుర్భర పరిస్థితులు కర్ణాటకలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పోలీస్ కమిషనర్ తనకు నచ్చిన విధంగా డిప్యూటీ కమిషనర్ ను కానీ, అసిస్టెంట్ కమిషనర్ ను కానీ, ఒక ఇన్స్ పెక్టర్ ను కానీ అపాయింట్ చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని... అంతా కోట్ల రూపాయల వేలం ద్వారా జరిగిపోతుందని విమర్శించారు. బెంగళూరులో ఎన్నో స్కాములు జరుగుతున్నాయని... ప్రజలు దారుణంగా మోసపోతున్నారని చెప్పారు.
కర్ణాటకలో పారదర్శక ప్రభుత్వాన్ని, పాలనను అందించేందుకు సరైన నాయకత్వం లేదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తాగు నీరు, విద్య, వైద్యం, రవాణా తదితర రంగాలలో తీసుకొచ్చిన సమూల మార్పులు తనను ఆప్ లో చేరేలా చేశాయని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ లో భాస్కర్ రావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. గత సోమవారం కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరారు.