Ganguly: సౌరవ్ గంగూలీ వర్సెస్ జై షా.. ఏ పదవి కోసమంటే..!

Sourav Ganguly vs Jay Shah battle for ICC Chairmen post

  • ఐసీసీ ఛైర్మన్ పదవిపై కన్నేసిన గంగూలీ, జై షా
  • 2023లో ఇండియాలో జరగనున్న ప్రపంచకప్
  • ఆ సమయానికల్లా భారతీయుడు ఐసీసీ ఛైర్మన్ గా ఉండాలని భావిస్తున్న బీసీసీఐ

ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐకి సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా... కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ అత్యంత కీలకమైన ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లేతో వీరిద్దరూ పోటీ పడబోతున్నట్టు కోల్ కతా డైలీ టెలిగ్రాఫ్ ఓ కథనాన్ని ప్రచురించింది. 2023 ఐసీసీ ప్రపంచ కప్ భారత్ లో జరగనుంది. ఆ సమయానికల్లా ఐసీసీ ఛైర్మన్ గా భారతీయుడు ఉండాలని బీసీసీఐ భావిస్తోంది.

2011లో జరిగిన ప్రపంచకప్ సమయంలో ఐసీసీ బాస్ గా శరద్ పవార్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రపంచకప్ లో ఇండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2023 ప్రపంచకప్ సమయానికి గంగూలీ కానీ, జైషా కానీ ఐసీసీ బాస్ గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం... ఐసీసీ పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. ఆరేళ్ల వరకు పదవీ కాలాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. 

ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే 2020 డిసెంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ఆయన కమర్షియల్ లాయర్ గా ఉన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లోని పలు కంపెనీలకు ఆయన పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న కమిట్ మెంట్స్ వల్ల... ఐసీసీ బాస్ పదవిలో ఆయన కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో, ఆ పదవిని చేజిక్కించుకునేందుకు బీసీసీఐ సీరియస్ గా ప్రయత్నిస్తోంది. 

టెలిగ్రాఫ్ కథనం ప్రకారం... ఐసీసీ ఛైర్మన్ పదవికి గంగూలీ పోటీ చేసేటట్టయితే వివిధ దేశాల బోర్డుల మద్దతును ఆయన కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. పాకిస్థాన్ బోర్డు సైతం గంగూలీకి సైలెంట్ గా మద్దతు పలికే అవకాశం ఉందా? అనేది కూడా ప్రశ్నార్థకమే. దీనికి తోడు జైషా కూడా ఈ పదవిపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుండటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News