Buttler: చివర్లో చెలరేగిన బట్లర్... బెంగళూరు టార్గెట్ 170 రన్స్
- ముంబయిలో మ్యాచ్
- టాస్ గెలిచిన బెంగళూరు
- మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 169
- 6 సిక్సర్లు బాదిన జోస్ బట్లర్
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ ఆఖరి ఓవర్లలో రెచ్చిపోయి ఆడడంతో ఆ జట్టు ఓ మోస్తరు భారీ స్కోరు సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 47 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు.
మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే అవుటైనా, వన్ డౌన్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 37 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి నిదానంగా ఇన్నింగ్స్ ను నడిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ (8) స్వల్ప స్కోరుకే అవుట్ కాగా, హెట్మెయర్ ధాటిగా ఆడాడు. హెట్మెయర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో బట్లర్ 2 సిక్సులు, హెట్మెయర్ 1 సిక్స్ బాదారు. అంతకుముందు ఓవర్లోనూ బట్లర్ రెండు సిక్స్ లు కొట్టి పరుగుల పండగ చేసుకున్నాడు. ఈ జోడీ విజృంభణతో బెంగళూరు జట్టు చివరి 5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుంది.