Nara Lokesh: జగన్‌కు నారా లోకేశ్ లేఖ.. విషయం ఏమిటంటే..!
- వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి
- ఈ దిశగా టీడీపీ హయాంలో చేపట్టిన చర్యల నివేదన
- విపక్ష నేతగా ఉండగా జగన్ ఇచ్చిన హామీల ప్రస్తావన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని లోకేశ్ సదరు లేఖలో సీఎంను కోరారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే దిశగా టీడీపీ హయాంలో జరిగిన చర్యలను ఈ సందర్భంగా లోకేశ్ ప్రస్తావించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్రం వద్ద చేసిన కృషిని కొనసాగించి సాధించాలని సీఎం జగన్‌కు లేఖ రాసినట్టు లోకేశ్ తెలిపారు. పురాతన కాలం నుంచీ వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ వృత్తిగా జీవనం సాగిస్తున్న నిరుపేద వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చి.. వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయంలో విశేష కృషి చేశామని లోకేశ్ తెలిపారు. ప్రతిపక్షనేతగా ఉండగా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని జగన్ చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు.
టీడీపీ ప్రభుత్వం పంపిన తీర్మానాలు కాకుండా తాను సీఎం అయ్యాక మొదటి అసెంబ్లీ సమావేశాలకే బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తానని చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని కూడా జగన్‌ను లోకేశ్ ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయి మూడేళ్లయినా,చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కనీసం చర్చ కూడా చేయలేదంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.