Karnataka: మసీదుల లౌడ్ స్పీకర్లు తీసేయాల్సిందే.. కర్ణాటకలో కొత్త వివాదం!
- లేదంటే మైకులతో హనుమాన్ చాలీసా వినిపిస్తాం
- భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన రాష్ట్రవ్యాప్త ఉద్యమం
- ప్రార్థనలకు కాదు.. మైకులకే వ్యతిరేకమని ప్రకటన
- మద్దతుగా మాట్లాడిన కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప
కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంటోంది. ముస్లింల ప్రార్థనాలయాలైన మసీదులపై మైకులు తీసేయాలన్న వాదనను మితవాద సంస్థలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం సద్దు మణిగేలోపే లౌడ్ స్పీకర్ల అంశం తెరపైకి రావడం గమనార్హం.
భజరంగ్ దళ్, శ్రీరామసేన ఈ అంశాన్ని చర్చకు తీసుకొస్తున్నాయి. మసీదుల్లో రోజూ ఐదు సార్లు అజా చేయడమే కాకుండా దాన్ని మైకుల్లో ప్రసారం చేయడం ఎప్పటినుంచో జరుగుతోంది. మైకుల్లో పెద్ద శబ్దంతో వినిపించే ప్రార్థనల వల్ల విద్యార్థులు, ఇతర వర్గాలకు ఇబ్బంది కలుగుతుందన్న అభ్యంతరం ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో, మసీదుల్లో ప్రార్థనను మైకుల ద్వారా ప్రసారం చేయడాన్ని నిలిపి వేయకపోతే.. అవే సమయాల్లో తాము హిందూ ఆలయాల్లో ఓమ్ నమశ్శివాయ, జైశ్రీరామ్, హనుమాన్ చాలీసాతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రసారం చేస్తామని ఆయా సంస్థలు హెచ్చరించాయి.
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కూడా ఈ వాదనకు అనుకూలంగా స్పందించారు. దీనికి పరిష్కారం ముస్లిం కమ్యూనిటీని విశ్వాసంలోకి తీసుకోవడం వల్లే సాధ్యమవుతుందన్నారు. ప్రార్థనల సమయాల్లో మైకులను వినియోగించడం ముస్లిం వర్గం ఎప్పటి నుంచో ఆచరిస్తోందని, కాకపోతే ఇది విద్యార్థులు, పిల్లలు, రోగులకు ఇబ్బంది కలిగిస్తోందన్నారు.
‘‘హనుమాన్ చాలీసాను ప్రసారం చేసేందుకు ఇది పోటీ కాదు. ముస్లింలు ప్రార్థన చేసేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, అదే సమయంలో మైకుల ద్వారా ఆలయాలు, చర్చిల్లో కూడా చేస్తే అప్పుడు మతాల మధ్య వివాదానికి దారితీస్తుంది’’ అని పేర్కొన్నారు. భజరంగ్ దళ్ నేత భరత్ శెట్టి మాట్లాడుతూ.. మసీదుల్లో లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు.
శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ సైతం స్పందించారు. ఉదయం 5 గంటలకు లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిలిపివేయాలని అధికారులను కోరినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. ‘‘వారి ప్రార్థనలను వ్యతిరేకించడం లేదు. కేవలం లౌడ్ స్పీకర్లపైనే మా అభ్యంతరం. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే పొద్దున్నే మేము సైతం భజనలు వినిపిస్తాం’’ అని ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు.