Andhra Pradesh: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ ధరల సవరణకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
- ఏపీలో కొత్తగా 13 జిల్లాలు
- పెరగనున్న జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ
- ధరల సవరణకు సిఫారసు చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
- ఎల్లుండి నుంచి ధరల సవరణ
ఏపీలో మొత్తం 26 జిల్లాలు రూపుదిద్దుకోవడం తెలిసిందే. కాగా, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ ధరలు సవరిస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఆయా జిల్లాల్లో భూముల మార్కెట్ ధరలు సవరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని భూముల విలువను పునఃసమీక్షించాలని సూచించారు.
ఈ సిఫారసును పరిశీలించిన ప్రభుత్వం ధరల సవరణకు ఆమోదం తెలిపింది. ఎల్లుండి నుంచి కొత్త మార్కెట్ ధరల సవరణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, మార్కెట్ విలువకు అనుగుణంగా కొత్త జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడడంతో ఆయా జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.