Hyderabad: మెట్రో రైళ్ల వేగం పెంపు.. మరింత తగ్గనున్న జర్నీ టైం
- గంటకు 90 కిలో మీటర్ల వేగంతో మెట్రో రైళ్లు
- వేగం పెంపునకు సీఎంఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్
- మూడు రోజుల తనిఖీలతో భద్రతపై సీఎంఆర్ఎస్ సంతృప్తి
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేగం మరింతగా పెరగనుంది. ప్రస్తుతం గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు ఇకపై గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఫలితంగా మెట్రో ప్రయాణికులకు మరింత సమయం ఆదా కానుంది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) నుంచి రైళ్ల వేగం పెంపునకు అనుమతి లభించింది.
గత నెల 28, 29, 30 తేదీల్లో సీఎంఆర్ఎస్ అధికారులు నగరంలోని మెట్రో రైళ్ల వేగం, భద్రతపై తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెట్రో రైళ్ల వేగం, భద్రతపై సీఎంఆర్ఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెట్రో రైళ్ల వేగాన్ని గంటకు మరో 10 కిలో మీటర్లు పెంచుకునేందుకు కూడా హైదరాబాద్ మెట్రోకు అనుమతించారు. సీఎంఆర్ఎస్ అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే మెట్రో రైళ్ల వేగం పెరగనుంది.
ఇదే జరిగితే..మెట్రో ప్రయాణికులకు మరింత సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు ఇకపై గంటకు 90 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెట్టడం మొదలుపెడితే.. నాగోల్- రాయదుర్గం మధ్య 6 నిమిషాలు, మియాపూర్- ఎల్బీ నగర్ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య 1.5 నిమిషం ఆదా అవుతుంది.