: దీర్ఘాయుష్షు వంశానుగతంగా వస్తుందట!
మీరు ఆరోగ్యంగా సుదీర్ఘకాలం పాటు జీవిస్తే... మీ సంతానం కూడా సుదీర్ఘకాలం పాటు జీవిస్తుందట. ఈ విషయాన్ని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మెడికల్ స్కూల్ పరిశోధక బృందం చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఇలా సుదీర్ఘకాలం పాటు జీవించే వారి పిల్లలకు హృదయ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయట. అంతేకాదు... వయసు మీరినపుడు వచ్చే క్యాన్సర్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిజేరవని పరిశోధకులు తేల్చారు.
భారత్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అంబరీష్ దత్తా కూడా పాల్గొన్న ఈ పరిశోధనలో 91 ఏళ్లు పూర్తి చేసుకున్న తల్లుల, 87 వసంతాలను పూర్తి చేసుకున్న తండ్రుల సంతానాలను, అలాగే అర్ధంతరంగా కాలం చేసిన వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిని గురించీ విడివిడిగా అధ్యయనం చేయడం జరిగింది. 1992 నుండి 2010 వరకూ సాగిన ఈ అధ్యయనంలో సుమారు 9,764 మందితో ఈ అధ్యయన బృందం రెండేళ్లకోసారి విడతలు విడతలుగా మాట్లాడింది. ఈ అధ్యయనంలో తల్లి లేదా తండ్రి ఎక్కువ కాలం జీవించిన వారి పిల్లలకు కూడా దీర్ఘాయుష్షు ఉంటుందని, అలాగే సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా 24 శాతం ఎక్కువ దూరంగా ఉంటుందని తేలింది. ఇంకా వృద్ధాప్యంలో వచ్చే మధుమేహం ఇతర సమస్యలు కూడా ఇలాంటి వారికి దూరంగా ఉంటాయట. కాబట్టి దీర్ఘాయుష్మాన్ భవ అని మీ పిల్లలను దీవించే ముందు మీరు ఆరోగ్యంగా సుదీర్ఘకాలం పాటు జీవించి మీ పిల్లలకు మీరే దీర్ఘాయుష్షును అందించండి!