Botsa Satyanarayana: విద్యుత్ చార్జీల పెంపుపై చంద్రబాబుకు మాట్లాడే అర్హతే లేదు: మంత్రి బొత్స
- ఏపీలో విద్యుత్ చార్జీల దుమారం
- ప్రభుత్వంపై మండిపడుతున్న విపక్షాలు
- విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు వెల్లడించిన బొత్స
- పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని స్పష్టీకరణ
జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకంపై సీఎం జగన్ తో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు అంశంపై విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో తీవ్రస్థాయిలో స్పందించారు.
విద్యుత్ చార్జీల పెంపుపై చంద్రబాబుకు ఏమాత్రం మాట్లాడే అర్హత లేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు, బషీర్ బాగ్ లో కాల్పుల ఘటనకు చంద్రబాబుదే పేటెంట్ అని విమర్శించారు. రైతులపై ఎవరి హయాంలో కాల్పులు జరిగాయో తెలియదా? అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు పెంచిన పర్యవసానంగానే బషీర్ బాగ్ లో కాల్పులు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచలేదా? అని నిలదీశారు.
తామేమైనా అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచితే అడగాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో టారిఫ్ ఎంత, ఇప్పుడు టారిఫ్ ఎంత? డిస్కమ్ ల ఆదాయం, అప్పులు, నిర్వహణ వ్యయం... తదితర అంశాలపై విపక్షం సూచనలు ఇస్తే బాగుంటుందని అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయని, వాటిని పరిశీలించి, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బొత్స వెల్లడించారు.