Baba Ramdev: పెట్రోలు ధరలపై గత వ్యాఖ్యలను గుర్తు చేస్తే ‘షటప్’ అంటూ జర్నలిస్టుపై రెచ్చిపోయిన రాందేవ్ బాబా.. వీడియో వైరల్!
- కాంగ్రెస్‌ను గద్దె దింపితే లీటరు పెట్రోలు రూ. 40కే వస్తుందన్న రాందేవ్ బాబా
- పెట్రోలు అసలు ధర రూ. 35 అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు
- ఇప్పుడిలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ హెచ్చరిక
- నీకంత మంచిది కాదంటూ బాబా వార్నింగ్
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు కోపమొచ్చింది. సహనం కోల్పోయి రిపోర్టర్‌పై ‘షటప్’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారితే (కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపితే) పెట్రోలు ధర లీటర్ రూ. 40కి దిగివస్తుందని అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ఓ రిపోర్టర్ ఆయనను ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాబా సహనం కోల్పోయారు.
2014లో రాందేవ్ బాబా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వద్ద ఓ అధ్యయనం ఉందని, పెట్రోలు ధర ప్రాథమికంగా 35 రూపాయలు మాత్రమేనని అన్నారు. దీనిపై 50 శాతం పన్ను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నును ఒక శాతానికి తగ్గిస్తే ఇంధనం ధర కూడా తగ్గుతుందని, తనకు ఆర్థికశాస్త్రం గురించి కూడా తెలుసని అన్నారు.
ప్రధాన ఆర్థికవేత్తలు దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేరని బాబా విమర్శించారు. వారందరూ అమెరికా సెన్సెక్స్, ఎఫ్‌డీఐలకు బానిసలని ఆరోపించారు. ప్రభుత్వం మారితే పెట్రోలు రూ. 40కే లభిస్తుందన్నారుగా? అని తాజాగా ఓ విలేకరి రాందేవ్ బాబాను ప్రశ్నించగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు.
‘‘షటప్.. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. సమాధానం చెప్పేందుకు నేనేమైనా నీ తాకేదార్‌నా? అప్పుడేదో చెప్పాను. ఇప్పడు కాదు. మీరు చేయగలిగింది చేయండి’’ అని బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇలాంటి ప్రశ్నలు అడగడం నీకు మంచిది కాదని కూడా రిపోర్టర్‌ను బెదిరించడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.