Cricket: బాబర్ ఆజం ఐపీఎల్ లో రూ.20 కోట్లకు అమ్ముడుపోయేవాడు: షోయబ్ అక్తర్
- కోహ్లీ, బాబర్ ఓపెనింగ్ చేస్తే ముచ్చటగా ఉంటుంది
- ఆ రోజు ఎప్పుడో అప్పుడు వస్తుంది
- 2008 తర్వాత ఐపీఎల్ ఆడని పాక్ ఆటగాళ్లు
ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు మంచి అవకాశాలుండేవి. షాహిద్ అఫ్రిదీ సహా ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో భాగమయ్యారు. అయితే, ఆ తర్వాత సరిహద్దు ఘర్షణలతో పాకిస్థాన్ తో భారత క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. ఇప్పటిదాకా ఐసీసీ టోర్నీలు తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు ఆడింది లేదు. ఐపీఎల్ లోనూ వాళ్లకు అవకాశాల్లేవు.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇప్పటి ఆటగాళ్లు ఐపీఎల్ లో పాల్గొని ఉంటే చాలా ధర వచ్చి ఉండేదని అన్నాడు. పాక్ డాషింగ్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజం ఇప్పుడు జరిగే ఐపీఎల్ వేలంలో పాల్గొని ఉంటే కచ్చితంగా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వచ్చి ఉండేవని పేర్కొన్నాడు.
అందరికన్నా అతడికే ఎక్కువ ముట్టజెప్పేవారని అన్నాడు. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీతో కలిసి బాబర్ ఆజం ఓపెనింగ్ చేస్తే మస్తు మజా వస్తుందని చెప్పాడు. ఏదో ఒక రోజు అది జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆడుతుంటే చాలా బాగుంటుందన్నాడు.
కాగా, 2008 ఐపీఎల్ ఓపెనింగ్ ఎడిషన్ లో మాత్రమే పాక్ ఆటగాళ్లు పాల్గొన్నారు. అప్పట్లో షాహిద్ అఫ్రీది మాత్రమే ఎక్కువ ధర సొంతం చేసుకున్నాడు. డెక్కన్ క్రానికల్స్ జట్టు అఫ్రిదీని ఒడిసిపట్టింది. అతడితో పాటు షోయబ్ అక్తర్, ఉమర్ గుల్, మిస్బావుల్ హఖ్, సోహెయిల్ తన్వీర్, కమ్రాన్ అక్మల్, సల్మాన్ భట్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్, మహ్మద్ ఆసిఫ్ లు ఐపీఎల్ లో ఆడారు. ఆ తర్వాత ఏ పాక్ ఆటగాడికీ ఐపీఎల్ లో చోటు దక్కలేదు.