India: రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి చేసుకుంటున్న భారత్
- ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన వంటనూనె దిగుమతులు
- పామాయిల్ సరఫరాపై ఇండోనేషియా ఆంక్షలు
- దక్షిణ అమెరికాలో తగ్గిన సోయాబీన్ సాగు
- అధిక ధర చెల్లించి రష్యా నుంచి వంటనూనె కొనుగోలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వంటనూనె దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్.. ఆ దేశం నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం అత్యధిక ధర చెల్లించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ అమెరికాలో సోయాబీన్ సాగు తగ్గడంతో వంటనూనెల లభ్యత తగ్గింది.
దీంతో రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం ద్వారా వంటనూనెల కొరతను అధిగమించవచ్చని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి తెలిపారు. వచ్చే నెలలో భారత్‌లో దిగుమతి అయ్యేలా ఈ సంస్థ రష్యా నుంచి 12 వేల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను కొనుగోలు చేసింది. అయితే, యుద్ధానికి ముందునాటితో పోలిస్తే అత్యధిక ధర చెల్లిస్తున్నట్టు డీలర్లు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు టన్నుకు 1630 డాలర్లు.. భారత కరెన్సీలో రూ. 1.25 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 2,150 డాలర్లు (దాదాపు రూ. 1.65 లక్షలు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు.