Buggana Rajendranath: రూ.100 కోట్లు అకౌంట్ మారినా బ్యాంకులు అప్రమత్తం అవుతాయి... రూ.48 వేల కోట్లు ఎలా దుర్వినియోగం అవుతాయి?: బుగ్గన
- ఏపీలో నిధుల దుర్వినియోగం అంటూ టీడీపీ ఆరోపణలు
- అందులో వాస్తవంలేదన్న బుగ్గన
- రూ.48 వేల కోట్లు ప్రత్యేక బిల్లుల రూపంలో ఉన్నట్టు వెల్లడి
ఏపీ ప్రభుత్వం రూ.48 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్టు టీడీపీ ఆరోపిస్తోందని, అందులో వాస్తవంలేదని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.100 కోట్లు అకౌంట్ మారినా బ్యాంకులు వెంటనే అప్రమత్తం అవుతాయని, అలాంటిది రూ.48 వేల కోట్ల ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందని ప్రశ్నించారు. సీఎఫ్ఎంఎస్ నుంచి తప్పుల సవరణకు కొంత సమయం పడుతుందని బుగ్గన వెల్లడించారు.
రూ.48,509 కోట్లు ప్రత్యేక బిల్లుల రూపంలో ఉన్నాయని వివరించారు. 15 అంశాల వారీగా ప్రతిదానికీ పద్దు ఉందని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగం జరగలేదని, అంశాలవారీగా కాగ్ కు నివేదించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు ఉన్నాయని అన్నారు.
పేదవాడి కోసమే తాము అప్పు చేశామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తోందని చెప్పుకొచ్చారు. నిధుల దుర్వినియోగం అంటూ అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందించడం తప్పు అని బుగ్గన వ్యాఖ్యానించారు.