IPL 2022: ఐపీఎల్ 2022: కొండంత లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన పంజాబ్

PBKS power to winning start in high scorer

  • 205 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఊదేసిన పంజాబ్
  • 8 బంతుల్లోనే ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసిన ఓడియిన్ స్మిత్
  • సిక్సర్ల మోత మోగించిన డుప్లెసిస్

ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ వీరబాదుడుకు తోడు, దినేశ్ కార్తీక్ మెరుపులు తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 206 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్‌కు ఓపెనర్లు చక్కని శుభారంభం అందించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 32 (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధవన్ 43 (29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్) పరుగులతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత భానుక రాజపక్స 43 (22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షారూఖ్ ఖాన్ 24 (20 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లు) పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. చివర్లో ఓడియన్ స్మిత్ మరింతగా చెలరేగాడు. కేవలం 8 బంతుల్లోనే ఫోర్, 3 సిక్సర్లతో ఏకంగా 25 పరుగులు పిండుకోవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి పంజాబ్ జట్టు విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు తొలుత పరుగుల కోసం ఇబ్బంది పడినా ఆ తర్వాత మాత్రం చెలరేగిపోయింది. డుప్లెసిస్ క్రీజులో కుదురుకున్నాక సిక్సర్ల మోత మోగించాడు. 57 బంతులలో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88 పరుగులు చేయగా, కోహ్లీ 29 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో దినేశ్ కార్తీక్ మరింతగా రెచ్చిపోయాడు. 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. 

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో ఇదే అత్యధిక స్కోరు కాగా, పంజాబ్ దీనిని అలవోకగా ఛేదించడం గమనార్హం. 8 బంతుల్లోనే ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి జట్టుకు విజయాన్ని అందించిపెట్టిన ఓడియన్ స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News