Srikakulam District: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత.. టీడీపీ నేతల నిరసన, ఉద్రిక్తత

Yerran Naidu Children Park demolished in narasannapet

  • నరసన్నపేటలో ఎర్రన్నాయుడు పార్క్ నిర్మాణం
  • గత ప్రభుత్వ హయాంలో అనుమతులు
  • నిధులు కూడా మంజూరు కావడంతో నిర్మాణం
  • జేసీబీలతో చేరుకుని కూల్చివేత
  • అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడి
  • జేసీబీలను సీజ్ చేసిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మిస్తున్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్కును కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. నిధులు కూడా మంజూరు కావడంతో పార్కును నిర్మిస్తున్నారు. అయితే, నిన్న వేకువ జామున కొందరు వ్యక్తులు రెండు జేసీబీలతో అక్కడకు చేరుకుని నిర్మాణంలో ఉన్న పార్కును కూల్చివేశారు. పార్కు ప్రహరీ, రీడింగ్ రూమ్, కార్యాలయ గదులతోపాటు అంతర్గతంగా వేసిన రోడ్లను కూడా ధ్వంసం చేశారు. 

సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మరికొందరు టీడీపీ కార్యకర్తలు పార్క్ వద్దకు చేరుకుని కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కూల్చివేత పనుల్లో ఉన్నవారు వారిపై దాడిచేయడంతో పరుగులు తీశారు. రమణమూర్తి ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూల్చివేతను అడ్డుకున్నారు. అందుకు ఉపయోగించిన రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రమణమూర్తితోపాటు పాటు టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపి ధర్నాకు దిగారు.

ఎర్రన్నాయుడు పార్క్ నిర్మాణానికి రూ. 2 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అప్పటి కలెక్టర్ అనుమతులు కూడా ఉన్నాయి. నరసన్నపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 34.50 లక్షలు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. అయితే, ఈ స్థలం తమదేనంటూ 15 మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులు పూర్తిగా జరగకుండా ఆగిపోయాయి.  కాగా, చిన్న పిల్లల కోసం నిర్మిస్తున్న ఈ పార్కును కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అరెస్ట్ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News