Sergei Shoigu: కనిపించకుండాపోయిన రష్యా రక్షణ మంత్రి... అదేమీలేదన్న ప్రభుత్వ వర్గాలు

Russian media focuses on defense minister Sergei Shoigu issue

  • అజ్ఞాతంలో సెర్గీ షోయిగు
  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర వెనుక కీలక వ్యూహకర్త
  • ఇప్పటికీ లొంగని ఉక్రెయిన్
  • షోయిగుపై పుతిన్ అసంతృప్తితో ఉన్నట్టు కథనాలు
  • షోయిగు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారన్న ఓ పత్రిక

సెర్గీ షోయిగు... రష్యా రక్షణమంత్రి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేపట్టడానికి ఇదే అనువైన సమయం అని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సలహా ఇచ్చింది ఈయనే అని చెబుతారు. కానీ, ఉక్రెయిన్ ఎంతకీ లొంగని నేపథ్యంలో, తనను షోయిగు తప్పుదారి పట్టించారని పుతిన్ అసహనంతో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. షోయిగును పదవి నుంచి సాగనంపుతారన్న ప్రచారం కూడా జరిగింది. 

ఈ నేపథ్యంలో, షోయిగు అజ్ఞాతంలోకి వెళ్లారని రష్యాకు చెందిన 'ఏజెంట్సోటోవ్' అనే పరిశోధనాత్మక పత్రిక పేర్కొంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలోని కొందరు అధికారులను ఉటంకిస్తూ ఈ కథనం ప్రచురించినట్టు 'ఏజెంట్సోటోవ్' తెలిపింది. 

ఈ పత్రిక కథనానికి బలం చేకూర్చే ఓ సంఘటన ఇటీవల జరిగింది. ఈ నెల 11న రష్యా జాతీయ భద్రతా మండలి సమావేశం జరగ్గా, ఈ సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కీలక సమావేశానికి షోయిగు ప్రత్యక్షంగా హాజరు కాకపోగా, కేవలం ఆయన గొంతుక మాత్రం వినిపించింది. 

అటు, అమెరికా ప్రభుత్వ వర్గాలు సైతం రష్యా రక్షణశాఖ తమ ఫోన్ కాల్స్ కు స్పందించడంలేదని ఆరోపిస్తున్నాయి. అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్... రష్యా రక్షణ మంత్రి షోయిగుతో చివరిసారిగా ఫిబ్రవరి 18న మాట్లాడారట. ఆ తర్వాత అమెరికా ఫోన్ కాల్స్ కు షోయిగు నుంచి, ఆయన కార్యాలయం నుంచి స్పందన కరవైంది. 

ఈ నేపథ్యంలో, రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై సైనిక చర్య జరుగుతోందని, ఈ సమయంలో రక్షణమంత్రికి ఎన్ని పనులు ఉంటాయో ఊహించుకోవచ్చని తెలిపారు. ఇలాంటి వేళ మీడియా సమావేశాలకు రక్షణమంత్రి రాలేరని... అందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని పెస్కోవ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News