cat: రూ.100 కోట్ల నష్టం తెచ్చిపెట్టిన పిల్లి!
- మహారాష్ట్రలోని పింప్రీ-చించ్వడ్ ప్రాంతంలో ఘటన
- ట్రాన్స్‌ఫార్మరు పైకి ఎక్కిన పిల్లి
- షార్ట్ సర్క్యూట్ సంభవించిన వైనం
- 60 వేల విద్యుత్తు కనెక్షన్లు కట్
- 3 రోజులపాటు విద్యుత్తుకు అంతరాయం
విద్యుత్ శాఖకు రూ.100 కోట్ల నష్టం తెచ్చిపెట్టిందో పిల్లి. ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రీ-చించ్వడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మహా ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు పైకి పిల్లి ఎక్కింది. దీంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోవడంతో కలకలం చెలరేగింది. భోసారి, భోసారి ఎంఐడీసీ, అకుర్ది ప్రాంతాల్లో 60 వేల మంది వినియోగదారులకు కరెంటు నిలిచిపోయింది.
పారిశ్రామిక ప్రాంతం భోసారిలో 7,000 మంది వ్యాపారులు విద్యుత్తు అంతరాయంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. నిన్నటి నుంచి ఆ ప్రాంతంలో విద్యుత్ లేదు. దీనిపై విద్యుత్తుశాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంతంలోని కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్ బెల్‌సారె కోరారు.
అయితే, మూడు రోజులపాటు విద్యుత్తు పునరుద్ధరణకు అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్తు అందుతోన్న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు పొదుపుగా వాడాలని అధికారులు కోరారు. లేదంటూ భారమంతా సింగిల్ ట్రాన్స్‌ఫార్మరుపై పడుతుందని చెప్పారు.