Karnataka: లైంగిక క్రూరత్వానికి వివాహం లైసెన్స్ కాదు: కర్ణాటక హైకోర్టు
- భర్త అకృత్యాలపై ఓ మహిళ పిటిషన్
- స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేనన్న కోర్టు
- భర్త ఎక్కువ కాదు.. భార్య తక్కువా కాదని వ్యాఖ్య
వివాహం పేరిట మహిళలపై వారి భర్తలు సాగిస్తున్న లైంగిక క్రూరత్వంపై కర్ణాటక హైకోర్టు బుధవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళలపై జరిగే లైంగిక క్రూరత్వానికి వివాహమేమీ లైసెన్స్ కాదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పెళ్లి పేరిట పురుషులు తమ భార్యలపై వికృత చేష్టలకు పాల్పడటం అనాగరికమైనదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకున్నంతనే మహిళలు తమకు బానిసలుగా భావిస్తున్న పురుషులు క్రూరమైన చర్యలకు పాల్పడటం సరికాదని కూడా కోర్టు తేల్చి చెప్పింది.
ఈ మేరకు కర్ణాటక హైకోర్టు బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన భర్త తనను లైంగిక బానిసగా చూస్తున్నాడని, తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడుతున్నాడని, అసహజ లైంగిక చర్యలకు బలవంతం చేస్తున్నాడని, తన కుమార్తె ముందే లైంగిక చర్యకు పూనుకుంటున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేనని చెప్పిన కోర్టు.. భార్య తక్కువ, భర్త ఎక్కువ అంటే కుదరదని తేల్చి చెప్పింది. వివాహం అనంతరం మహిళపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడే భర్తల గురించి తామేమీ మాట్లాడటం లేదని చెప్పిన కోర్టు.. పెళ్లి చేసుకుంటేనే భార్యలను ఎలాగైనా చూడొచ్చని భావిస్తున్న భర్తల గురించే చర్చిస్తున్నామని చెప్పింది.