Russia: చెర్నోబిల్ డేంజర్.. పనిచేయని రేడియేషన్ మానిటరింగ్ సిస్టమ్
- వెల్లడించిన ఉక్రెయిన్ ప్రభుత్వ అణుసంస్థ
- ఉక్రెయిన్ తో పాటు సరిహద్దు దేశాలకూ ముప్పేనని హెచ్చరిక
- కార్చిచ్చులను ఆర్పేసే అగ్నిమాపక సేవలూ లేవని ఆవేదన
ఉక్రెయిన్ తో పాటు దాని సరిహద్దు యూరప్ దేశాలకు చెర్నోబిల్ అణు ధార్మికత ముప్పు పొంచి ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వ అణు సంస్థ ఎనర్జో ఆటమ్ ప్రకటించింది. రష్యా ఆక్రమిత చెర్నోబిల్ ప్లాంట్ చుట్టుపక్కల రేడియేషన్ ను లెక్కించే, పర్యవేక్షించే వ్యవస్థలేవీ పనిచేయడం లేదని, కార్చిచ్చులను ఆర్పివేసే అగ్నిమాపక సేవలూ అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేసింది.
రష్యా ఆక్రమణల నేపథ్యంలో చెర్నోబిల్ అణు కేంద్రం చుట్టూ నిషేధిత ప్రాంత జాబితాలోని అడవుల్లో రేడియేషన్ మానిటరింగ్ సిస్టమ్స్ పనిచేయట్లేదని తెలిపింది. ఇప్పుడు అడవుల్లో మంటలు చెలరేగే కాలమని, కార్చిచ్చులు రేగితే ఆర్పేందుకు ఫైర్ ఫైటర్ సర్వీసులు అందుబాటులో లేవని పేర్కొంది.
దాని వల్ల రేడియేషన్ స్థాయులను గుర్తించడం కష్టమవుతుందని తెలిపింది. ఫలితంగా ఉక్రెయిన్ తో పాటు ఇతర దేశాలకూ రేడియేషన్ ముప్పు చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ సిబ్బంది చెర్నోబిల్ ప్లాంట్ లోనే పనిచేస్తున్నారని పేర్కొంది.