sound sleep: మంచి నిద్ర కోసం ఇవి తీసుకోండి చాలు..!
- కడుపు నిండితేనే మనసునిండా నిద్ర
- రాత్రి భోజనంలో చేర్చే పదార్థాలు కీలకం
- లో, సింపుల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మంచివి
- మాంసం, ఎముకల పులుసుతో ఫలితం
- కాఫీ, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి
ఆహారం నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుందని ఎంత మందికి తెలుసు? తీసుకునే ఆహారం మన జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. అందులో భాగంగానే నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుంది. అందుకనే రాత్రి గాఢ నిద్ర, నాణ్యమైన నిద్ర కోరుకునే వారు డిన్నర్ లో భాగంగా తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ద చూపించుకోవాల్సిందే. కడుపు నిండిన భావనతోనే మంచి నిద్ర పడుతుందన్నది ఇక్కడి ఆహార పదార్థాల జాబితా చూస్తే తెలుసుకోవచ్చు.
రైస్, బంగాళా దుంపల్లో లో-కాంప్లెక్స్ కార్బొ హైడ్రేట్లు ఉంటాయి. ఇవి మంచి గాఢ నిద్రకు దారితీస్తాయి. సెరటోనిన్, మెలటోనిన్ స్థాయులను లో-కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్లు పెంచుతాయి. అలాగే, సింపుల్ కార్బొహైడ్రేట్లు ఉన్న వాటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పెద్దగా శ్రమించాల్సిన పని ఉండదు. కనుక వీటిని తీసుకోవచ్చు.
నాణ్యమైన మాంసాహారంతో ప్రొటీన్ స్థాయులు పెరుగుతాయి. దీంతో కడుపు నిండిపోతుంది. అది మంచి నిద్రకు దారితీస్తుంది. ఆర్గానిక్ మీట్ అన్నది న్యూరోట్రాన్స్ మీటర్లను రిపేర్ చేస్తుంది. ఇది కూడా మంచి గాఢ నిద్రకు సాయపడుతుంది.
ఎముకలను ఉడకబెట్టి చేసిన పులుసులో గ్లైసిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ అమైనో యాసిడ్. మెదడు విశ్రాంతికి ఇది సాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
నిద్ర సమస్యలకు చిట్కా వైద్యంగా గసగసాలు, జాజికాయ వాడకం పూర్వం నుంచి ఉంది. వీటి పౌడర్ ను పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది.
నిద్రకు కొన్నిగంటల ముందు కాఫీ తీసుకోవడం అస్సలు చేయకూడదు. ఇందులోని కెఫీన్ నిద్రను చాలా సమయం పాటు ఆలస్యం చేస్తుంది. అంతేకాదు నిద్రించే సమయం కూడా తగ్గిపోతుంది. నాణ్యమైన నిద్ర కూడా సాధ్యపడదు.
ఆల్కహాల్ కూడా నిద్రకు నష్టం చేసేదే. కొంచెం పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటే మంచిదన్న అపోహ వద్దు. ఎందుకంటే, ఇది గాబా, గ్లూటమేట్ స్థాయులను మార్చేస్తుంది. దీంతో శరీరం రీచార్జ్ అయ్యే ప్రక్రియకు ఆల్కహాల్ అడ్డుపడుతుంది. మద్యం మత్తులో నిద్రపోయినట్టు అనిపించినా.. మీ శరీరం రిపేర్ చేసుకునే ప్రక్రియ సాఫీగా సాగదు.
స్పైసీగా ఉండే పదార్థాలను కూడా రాత్రి సమయంలో తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపిస్తాయి. గుండెమంట వంటి సమస్యలు రావచ్చు. స్పైసీ గుణం నిద్రకు భంగకరంగా మారుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకూ దూరంగా ఉండాలి. అలాగే, అసలు ఉప్పు తీసుకోకపోవడం కూడా నిద్రకు ప్రతికూలంగా మారుతుంది. కనుక సరైన మోతాదులో సోడియం తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అడ్రెనలిన్ తక్కువగా ఉండాలంటే సోడియం అవసరం.