- ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ స్థానం భర్తీ
- గాయం కారణంగా దూరమైన వుడ్
- దీంతో ముజరబాని ఎంపిక
ఐపీఎల్ 2022 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం అవుతుందనగా.. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ జింబాబ్వే పేసర్ ముజరబానితో సంతకం చేసింది. ఇటీవలి మెగా వేలంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ను రూ.7.5 కోట్లకు ఎల్ఎస్జీ కొనుగోలు చేసింది.
అయితే కుడి మోచేయి గాయం కారణంగా వుడ్ ఈ సీజన్ కు దూరమయ్యాడు. ఈ ఏడాది నుంచి కొత్తగా చేరిన రెండు జట్లలో ఎల్ఎస్జీ కూడా ఒకటి. కేఎల్ రాహుల్ సారథ్యంలో మంచి ప్రదర్శన చేసేందుకు జట్టు యాజమాన్యం పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో మార్క్ వుడ్ దూరం కావడం యాజమాన్యానికి మింగుడు పడలేదు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.
దీంతో ముజరబాని సరైన ఎంపికగా భావించి అతడితో ఎల్ఎస్జీ అంగీకారానికి వచ్చింది. అతడికి ఎంత మొత్తం చెల్లించేదీ ఎల్ఎస్జీ యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు. ఈ పరిణామాన్ని ధ్రువీకరిస్తూ.. జింబాబ్వేలో భారత రాయబారి ముజరబానిని కలుసుకున్నారు. అతడ్ని అభినందిస్తున్న ఫొటోను ట్విట్టర్ లో భారత్ ఎంబసీ పోస్ట్ చేసింది.