Srikrishna Dairy: 'శ్రీకృష్ణ' డెయిరీని చేజిక్కించుకున్న ఫలితం.. రివ్వున ఎగసిన 'దొడ్ల' డెయిరీ షేర్ విలువ
- శ్రీకృష్ణ డెయిరీని టేకోవర్ చేసిన దొడ్ల డెయిరీ
- రూ.50 కోట్లకు కుదిరిన డీల్
- రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి
హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాల వ్యాపారం చేస్తున్న దొడ్ల డెయిరీ షేర్ విలువ సోమవారం అలా రివ్వున ఎగసిపడింది. ఒకానొక దశలో దాదాపుగా 20 శాతం మేర పెరిగిన దొడ్ల డెయిరీ షేర్ విలువ... ఆ తర్వాత కాస్తంత మందగించినా.. మొత్తంగా భారీ పెరుగుదలను నమోదు చేసింది. కర్ణాటకకు చెందన తొలి ప్రైవేట్ డెయిరీ అయిన శ్రీకృష్ణ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసిన ఫలితంగానే దొడ్ల షేర్ విలువ దూసుకుపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
1989లో కర్ణాటకలో కార్యకలాపాలు ప్రారంభించిన శ్రీకృష్ణ డెయిరీ.. ఆ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ డెయిరీగా రికార్డులకెక్కింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ.67 కోట్ల టర్నోవర్‌ను సాధించిన ఈ సంస్థ.. అంతకుముందు ఏడాదిలో ఏకంగా రూ.76 కోట్ల టర్నోవర్‌ను అందుకుంది. ఈ డెయిరీని డొడ్ల డెయిరీ కేవలం రూ.50 కోట్లకే టేకోవర్ చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి కానున్నట్లుగా దొడ్ల డెయిరీ శనివారం నాడు ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలోనే సోమవారం దొడ్ల డెయిరీ షేర్ 19 శాతం మేర మేర పెరిగి రూ.548ని తాకింది.