KCR: టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం
- సీఎం కేసీఆర్ నేతృత్వంలో భేటీ
- పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతోన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లాల అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొంటున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అలాగే పలు అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్‌మెంట్లు కోరారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఢిల్లీలోనే ధర్నా చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. యాసంగి వడ్లు కొనకపోవడంతో తెలంగాణలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ నేతలు కొన్ని నెలలుగా విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.