Telugudesam: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
- కల్తీ సారా, బెల్టు షాపులపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యుల డిమాండ్
- అసెంబ్లీలోనే ఆందోళన చేసిన వైనం
- సభా గౌరవాన్ని దిగజార్చుతున్నారని కన్నబాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులపై మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్రంలో కల్తీ సారా, బెల్టు షాపులపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అందుకు ఏపీ సర్కారు ఒప్పుకోవట్లేదన్న విషయం తెలిసిందే. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే నిరసన తెలుపుతున్నారు.
ఈ రోజు కూడా వారు ఆందోళనకు దిగడంతో సభా సమయం వృథా అవుతోందని పేర్కొంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో వారిని ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... సభా గౌరవాన్ని దిగజార్చడమే లక్ష్యంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
మరోవైపు, మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ... పెగాసస్‌పై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు విచారణకు కమిటీ కూడా వేసిందని తెలిపారు. దేశంలో ఆ స్పైవేర్‌ను ఎవరు కొన్నారన్న విషయంతో పాటు దాన్ని ఎలా వినియోగించారనేది కూడా తేలాల్సి ఉందని చెప్పారు.