Cyclone: రేపటికి తుపానుగా మారనున్న అసాని.. ఎల్లుండి తీరాన్ని దాటుతుంది: ఐఎండీ
- అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం
- నేడు వాయుగుండంగా మార్పు
- కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు
- హెల్ప్ లైన్ల ఏర్పాటు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ సముద్రానికి దక్షిణాన కొనసాగుతోంది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల వెంట ఉత్తర దిక్కులో కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. నేడు మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని.. 21వ తేదీ నాటికి తుపానుగా మారుతుందని పేర్కొంది. దీనికి అసానీ అని పేరు పెట్టారు.
ఆదివారం ఉదయానికి పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం నెలకొని ఉంది. మార్చి 22వ తేదీ నాటికి బంగ్లాదేశ్ - మయన్మార్ తీరాలను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేశారు.