Rajamouli: మమ్మల్ని నెగ్గించడానికి చిరంజీవి చాలా తగ్గి మాట్లాడారు: రాజమౌళి

Rajamouli heaps praise on Megastar Chiranjeevi

  • కర్ణాటక గడ్డపై ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి
  • సీఎంలు జగన్, కేసీఆర్ లకు కృతజ్ఞతలన్న రాజమౌళి 

చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి ప్రసంగించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన సీఎంలు జగన్, కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అటు, మెగాస్టార్ చిరంజీవికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తమను నెగ్గించడానికి చిరంజీవి చాలా తగ్గి మాట్లాడారని కొనియాడారు. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని గౌరవిస్తానని రాజమౌళి స్పష్టం చేశారు. 

"ఏపీ ప్రభుత్వం పది నెలల కిందట టికెట్ రేట్లు తగ్గించినప్పుడు ఇది చిత్ర పరిశ్రమకు ఇబ్బందికరం అని భావించాం. అదే విషయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేట్టు చెప్పడానికి చాలా ప్రయత్నించాం. వ్యక్తిగతంగా నేనూ ప్రయత్నించాను, ఇండస్ట్రీ మొత్తం ప్రయత్నించింది. ఎవరం కూడా ముందుకు వెళ్లలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి, ముఖ్యమంత్రితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, రెండు మూడు సార్లు వెళ్లి సీఎంను కలిసి మొత్తం పరిస్థితిని వివరించారు. ఆయన ప్రయత్నాల ఫలితమే ఏపీ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చింది. టికెట్ రేట్లు పెంచేందుకు కారకుడైన ఆ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. 

ఆయన్ను చాలామంది రకరకాలుగా మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారు. చిరంజీవి గారూ మీరు నిజంగా మెగాస్టార్. ఇంకా చాలామందికి తెలియని విషయం ఇంకోటుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి గతంలో వచ్చిన జీవోకి కూడా చిరంజీవి గారే కారణం. ఆయన తెరవెనుక ఉండి అంతా నడిపించారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఉండాలనుకుంటారు. నేను మాత్రం ఆయనను ఇండస్ట్రీ పెద్దగానే భావిస్తాను. చిత్ర పరిశ్రమ అంతా ఆయనకు రుణపడి ఉండాలి" అని రాజమౌళి భావోద్వేగాలతో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News