Vijayashanti: పెయిడ్ స‌ర్వీసులుగా ఫ్రీ స‌ర్వీసులు.. స‌ర్కారీ ద‌వాఖానాల‌పై రాముల‌మ్మ ఫైర్‌

bjp leader vijayashanti fires on kcr government

  • స‌ర్కారీ ఆసుప‌త్రు‌ల్లో వ‌సూళ్ల దందా
  • రూ,500 మొద‌లై రూ.5 వేల‌కు వ‌ర‌కూ వ‌సూళ్లు
  • పేదలే కేసీఆర్ స‌ర్కారుకు గుణపాఠం చెబుతారన్న విజ‌య‌శాంతి 

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఉచితంగా ద‌క్కాల్సిన వైద్య సేవ‌లు డ‌బ్బు చెల్లిస్తేనే గానీ అంద‌డం లేద‌ని బీజేపీ నేత‌, మెద‌క్ మాజీ ఎంపీ విజ‌య‌శాంతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లోని ప‌లు స‌ర్కారీ ద‌వాఖానాల పేర్లు చెప్పి మ‌రీ... వాటిలో ఏఏ సేవ‌ల‌కు ఎంత మేర వసూలు చేస్తున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కాసేప‌టి క్రితం ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతా వేదిక‌గా వ‌రుస ట్వీట్‌లు చేశారు. 

ఫ్రీ స‌ర్వీసులు అన్నీ పెయిడ్ స‌ర్వీసులుగా మారిపోతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రాముల‌మ్మ‌.. పేద ప్ర‌జ‌ల‌కు వైద్యం అంద‌కుండా చేస్తున్న ఈ దొర‌ల స‌ర్కారు ఆ పేద ప్ర‌జ‌లే కర్రు కాల్చి వాత పెడ‌తార‌ని హెచ్చ‌రించారు. 

ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు ఎందుకు ఏర్పాటు చేశార‌న్న విష‌యాన్నిగుర్తు చేసిన విజ‌య‌శాంతి.. ప్ర‌తి టెస్టుకు ప్ర‌జ‌ల నుంచి ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేస్తున్నారని కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. సిటీ స్కాన్‌కు రూ.800, ఎంఆర్ఐకి రూ.2 వేలు, పెట్ స్కాన్‌కు ఏకంగా రూ.5 వేల‌ను వ‌సూలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. ఈ మొత్తాల‌ను బిల్లులుగా కాకుండా ఆసుప‌త్రికి డొనేష‌న్లుగా స్వీక‌రిస్తున్న‌ట్లు స్లిప్పులు ఇస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇదేంట‌ని అడిగిన వారిపై ఆసుప‌త్రుల సిబ్బంది బెదిరిస్తున్నార‌ని, ఈ త‌తంగం మొత్తం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనుమ‌తితోనే సాగుతోందని ఆమె ఆరోపించారు. 

హైద‌రాబాద్‌లోని ఎంఎన్జే కేన్స‌ర్ ఆసుప‌త్రి, ఈఎన్టీ ఆసుప‌త్రి, చెస్ట్ ఆసుప‌త్రి అన్నింటిలోనూ ఈ దందా సాగుతోంద‌ని విజ‌య‌శాంతి ఆరోపించారు. కేన్స‌ర్ రోగుల‌కు ఉచితంగా సేవ‌లు అందించేందుకు ఏర్పాటు చేసిన ఎంఎన్‌జే ఆసుప‌త్రి పేద‌ల‌కు అందుబాటులో ఉన్న ఏకైక కేన్స‌ర్ ఆసుప‌త్రిగా ఆమె పేర్కొన్నారు. అలాంటి ఆసుప‌త్రిలోనూ వ‌సూళ్ల దందా సాగుతోంద‌ని మండిప‌డ్డారు. పేద‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న‌కేసీఆర్ స‌ర్కారుకు పేద‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని ఆమె హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News