KTR: అమెరికా పర్యటనకు బయల్దేరుతున్న కేటీఆర్.. 10 రోజులు అక్కడే మకాం!
- ఐటీ, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ యూఎస్ పర్యటన
- కేటీఆర్ వెంట వెళ్తున్న ఉన్నతాధికారుల బృందం
- ప్రముఖ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ కానున్న మంత్రి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు. రాష్ట్రానికి ఐటీ, పారిశ్రామిక పెట్టుబడులను సాధించేందుకు 10 రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు అధికారులతో కూడిన బృందం కూడా అమెరికాకు పయనమవుతోంది.
ఈ నెల 29 వరకు వీరు అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటిస్తారు. కేటీఆర్ వెంట వెళ్తున్న వారిలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి ఉన్నారు. ఈ రోజు వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరుతున్నారు.
అమెరికాలో లాస్ ఏంజెలెస్ లో వీరి పర్యటన మొదలవుతుంది. శాండియాగో, శాన్ జోస్, బోస్టన్, న్యూయార్క్ లలో పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా వీరు ప్రముఖ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ, పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.