teacher: విద్యార్థినులపై టీచర్ అత్యాచారాలు.. రాజస్థాన్ నాగోర్ లో దారుణం!
- వెలుగులోకి పీఈటీ అకృత్యాలు
- అతడి చేతిలో వేధింపులకు గురైన అక్కాచెల్లెళ్లు
- ధైర్యం చేసి ముందుకు రావడంతో పోలీసు కేసు నమోదు
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులు. కానీ విలువలు పడిపోతున్న సమాజంలో కొందరు గురువులు కీచకుల మాదిరి ప్రవర్తిస్తున్నారు. హైస్కూల్ విద్యార్థినులపై అత్యాచారాలు చేస్తున్న ఓ కామాంధుడి బాగోతం రాజస్థాన్ లో వెలుగుచూసింది.
ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లపై వ్యాయామ టీచర్ (పీఈటీ) అత్యాచారం చేయడంతో.. ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. దీంతో నాగోర్ పట్టణంలోని పంచోరి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలికల స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈ కేసు వివరాలను స్టేషన్ హౌస్ ఆఫీసర్ అబ్దుల్ రావూఫ్ తెలియజేశారు.
సదరు కుటుంబంలోని పెద్దమ్మాయి 2018లో 9వ తరగతి చదువుతుండగా ఓ రోజు పీఈటీ హరిరామ్ (30) ఆమెను ఖాళీ తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. మళ్లీ 10వ తరగతి చదువుతున్నప్పుడు కూడా అతడు అదే విధంగా ఆమెపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక భయపడిపోయి స్కూలు మానేసింది. కానీ, తల్లిదండ్రులకు జరిగింది చెప్పలేకపోయింది.
తాజాగా ఈ నెల 5న సదరు బాలిక చెల్లిపైనా అదే పీఈటీ అత్యాచారం చేశాడు. దీంతో పెద్దమ్మాయి కూడా తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సదరు దుర్మార్గుడి చేతిలో ఇంకెంత మంది విద్యార్థులు మోసపోయారన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు.