Russia: యుద్ధం ఎఫెక్ట్!..రష్యాలో ఇన్‌స్టాగ్రామ్ సేవలు బంద్!
- గూగుల్, మెటా సంస్థల వరుస ఆంక్షలు
- తాజాగా ఇన్‌స్టా సేవలను రద్దు చేస్తున్నట్లు మెటా ప్రకటన
- మెటాకు 80 మిలియన్ల యూజర్లు తగ్గుతారని అంచనా
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో కదులుతున్న రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాటో, ఈయూ దేశాలతో పాటు అమెరికా కూడా రష్యాపై ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాకు చెందిన పలు సంస్థలు, టెక్ సంస్థలు కూడా రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ తన సేవలను రష్యాలో పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
ఇప్పటికే టాప్ టెక్ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గూగుల్ సెర్చ్ టూల్‌తో పాటు యూట్యూబ్‌లో కొన్ని ఫీచర్లను రష్యాలో తొలగించాయి. యాపిల్ సైతం రష్యాలో ఐఫోన్ సహా.. యాపిల్‌కు చెందిన అన్ని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపేసింది. గూగుల్ తో పాటు, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. వాటి ప్లాట్‌ఫామ్స్‌లో రష్యా మీడియాను నిషేధించాయి. అక్కడితోనే ఆగని మెటా ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్, మానిటైజేషన్‌ను నిలిపివేసింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ను రష్యాలో పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి స్వయంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో రష్యాలో పాప్యులర్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన సుమారు 80 మిలియన్ల మంది యూజర్లు తగ్గుతారని ఆయన అంచనా వేశారు. కాగా, ఇటీవల కొన్ని దేశాల్లోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యన్ సైనికులపై హింసకు పిలుపునిస్తున్నారని, ఇందులో భాగంగా మెటా తన భద్రతా పద్ధతులను మారుస్తోందంటూ ఇటీవలే రాయిటర్స్ సంస్థ ఓ వార్తా కథనాన్ని రాసింది. ఈ వార్త వచ్చిన కొద్ది రోజులకే ఇన్‌స్టాగ్రామ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.