health check: మహిళల ఆరోగ్యం కోసం ఈ టెస్ట్ లు తప్పనిసరి

health check ups that every woman should take

  • 30-40 ఏళ్లకే జీవనశైలి వ్యాధులు
  • పెరిగిపోతున్న ప్రాణాంతక కేన్సర్ కేసులు
  • ముందుగా గుర్తిస్తేనే చికిత్స సులభం
  • ఎక్కువ మందిలో రక్త హీనత
  • సాధారణ పరీక్షలతోనే వీటిని గుర్తించొచ్చు

‘చికిత్స కంటే నివారణ మెరుగైన మార్గం’ అని వైద్యులు చెబుతుంటారు. సమస్య ఏమీ లేనప్పుడు ఈ వైద్య పరీక్షలు ఎందుకు? చాలా మంది ఇలానే అనుకుంటుంటారు. కానీ, కొన్ని మహమ్మారులు ముదిరితేనే కానీ బయటకు రావు. 

ఉదాహరణకు కేన్సర్. దీన్ని ఎక్కువగా మూడు, నాలుగో దశల్లోనే గుర్తిస్తుంటారు. కారణం అప్పటి వరకు ఏ లక్షణాలు కనిపించకపోవడమే. కానీ, మొదటి రెండు దశల్లో కేన్సర్ ను గుర్తిస్తే ప్రాణాపాయం లేకుండా బయట పడొచ్చు. అందుకని ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరం. ముఖ్యంగా మహిళలకు నేడు ఎన్నో ఆరోగ్య సమస్యల రిస్క్ ఉంటోంది. వారి కోసం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ముందస్తు పరీక్షల వివరాలు ఇవీ..

రక్తపోటు..
బీపీ చెకప్ అన్నది 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ అవసరమే. ముఖ్యంగా గర్భధారణ, డెలివరీ తర్వాత కూడా కనీసం మూడు/ఆరు నెలలకు ఒకసారి బీపీ చెకప్ చేయించుకోవాలి. బీపీ అదుపులో లేకపోతే గుండె జబ్బులకు దారితీస్తుంది. కుటుంబ ఒత్తిడులు కూడా బీపీ పెరిగేందుకు దారితీస్తాయి. రెగ్యులర్ గా దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.

బోన్ డెన్సిటీ టెస్ట్
మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎక్కువగా క్యాల్షియం లోపం కనిపిస్తుంటుంది. దీనివల్ల బోన్ డెన్సిటీ కోల్పోతుంటారు. అందుకని 40 ఏళ్లు దాటిన మహిళలు బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి.

థైరాయిడ్ టెస్ట్
మారిన జీవన శైలి, ఆహార నియమాలతో నేడు మహిళల్లో థైరాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. థైరాయిడ్ గ్రంధి పనితీరు గతి తప్పుతోంది. అందుకని ఏడాదికోసారి అయినా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం అవసరం. 

పాప్ స్మియర్, హెచ్ పీవీ/ మమోగ్రామ్
మహిళలో బ్రెస్ట్ కేన్సర్ కేసులు ఎక్కువగా వింటున్నాం. దీనికితోడు ఎక్కువగా వచ్చే కేసుల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్ కూడా ఒకటి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పీవీ) వల్ల గర్భాశయ ముఖద్వార కేన్సర్ వస్తుంది. మహిళల్లో 35 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ కేన్సర్ బయటపడుతోంది. అందుకని 25 ఏళ్లు దాటిన వారు పాప్ స్మియర్, హెచ్ పీవీ టెస్ట్ ల ద్వారా సర్వెకల్ కేన్సర్ లేదని నిర్ధారించుకోవడం శ్రేయస్కరం. అలాగే మమోగ్రామ్ పరీక్ష ద్వారా బ్రెస్ట్ కేన్సర్ ను గుర్తించొచ్చు. 

బీఎంఐ ఇండెక్స్
ఒబెసిటీ ఎన్నో సమస్యలకు దారితీస్తుందని తెలుసా? రక్తపోటు, మధుమేహం గుండె జబ్బులు, ఆర్థరైటిస్, థైరాయిడ్ ఇలా ఎన్నో సమస్యలకు ఒబెసిటీ కారణమవుతుంది. అందుకని బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) పరిమితుల్లో ఉండేలా చూసుకోవాలి.

కంటి పరీక్షలు
మహిళల్లో గ్లకోమా కేసులు ఎక్కువ కనిపిస్తుంటాయి. రెటీనా సమస్యలు కూడా బాగా ముదిరిన తర్వాతే బయటపడుతుంటాయి. కనుక ఏడాదికోసారి కంటి వైద్యులతో పరీక్ష చేయించుకోవడం అవసరం.

కొలెస్ట్రాల్
అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకం చేస్తుంది. గుండె పోటు, పక్షవాతానికి దారితీస్తుంది. 30 ఏళ్లు నిండిన వారు ఏడాదికోసారి లిపిడ్ ప్రొఫైల్స్ పరీక్ష ద్వారా ఎలా ఉన్నదీ నిర్ధారించుకోవాలి.

కొలనోస్కోపీ
దీని సాయంతో కోలన్ కేన్సర్ ను గుర్తించొచ్చు. ముందు చెప్పుకున్నట్టు కేన్సర్ ను ఎంత వేగంగా గుర్తిస్తే చికిత్స అంత సులభంగా ఉంటుంది.

సీబీపీ
ఇది సాధారణ రక్త పరీక్షల్లో భాగం. దీని ద్వారా రక్త హీనత ఉంటే తెలుస్తుంది. ప్రతి నలుగురు మహిళల్లో ఇద్దరిలో రక్త హీనత ఉంటుంది. కానీ తెలుసుకుని చికిత్స తీసుకునే వారు కొద్ది మందే.

హెచ్ బీఏ 1సీ
రక్తంలో గ్లూకోజు స్థాయులు క్రితం మూడు నెలల్లో ఎలా ఉన్నదీ చెబుతుంది. ఆరోగ్యవంతులు ఏడాదికోసారి చేయించుకుంటే చాలు.

  • Loading...

More Telugu News