Vanama Raghava: కుటుంబం ఆత్మహత్య కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవకు బెయిలు
- ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు
- 61 రోజులుగా జైలులోనే రాఘవ
- షరతులతో కూడిన బెయిలు మంజూరు
- కొత్తగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించవద్దని ఆదేశం
ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. రాఘవ వేధింపులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయి 61 రోజులుగా జైలులో ఉన్న రాఘవపై పోలీసులు అభియోగపత్రం కూడా దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో బెయిలు కోసం రాఘవ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించరాదని, ప్రతి శనివారం ఖమ్మం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రలోభ పెట్టరాదని, భయపెట్టకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని ఆదేశాల్లో కోర్టు పేర్కొంది.